Ross Taylor: ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమాని నా ముఖంపై నాలుగుసార్లు కొట్టాడు.. సంచలన విషయాన్ని వెల్లడించిన కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్
- తన ఆత్మకథ ‘బ్లాక్ అండ్ వైట్’లో రాసుకొచ్చిన టేలర్
- ఆ దెబ్బలు గట్టిగా తగల్లేదన్న కివీస్ క్రికెటర్
- ఆ విషయాన్ని అక్కడితోనే వదిలేశానని వ్యాఖ్య
- ప్రొఫెషనల్ స్పోర్టింగ్‌లో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదన్న రాస్ టేలర్
ఐపీఎల్లో ఓ మ్యాచ్‌లో డకౌట్ అయినందుకు ఓ ఫ్రాంచైజీ యజమాని తన ముఖంపై మూడునాలుగుసార్లు కొట్టాడని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ వారం విడుదలైన టేలర్ ఆటోబయోగ్రఫీ ‘బ్లాక్ అండ్ వైట్’లో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన టేలర్.. పంజాబ్ కింగ్స్ (అప్పట్లో కింగ్స్ ఎలెవన్) జట్టుతో జరిగిన మ్యాచ్ తర్వాత ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నాడు. ఆ మ్యాచ్‌లో 195 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ దారుణంగా ఓడింది. ఈ మ్యాచ్‌లో టేలర్ డకౌట్ అయ్యాడు.
ఇదే విషయాన్ని ‘బ్లాక్ అండ్ వైట్’లో ప్రస్తావిస్తూ.. ‘‘ఆ మ్యాచ్ మొహాలీలో జరిగింది. 195 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన మేం లక్ష్యానికి దగ్గరగా కూడా వెళ్లలేకపోయాం. నేను పరుగులేమీ చేయకుండానే ఎల్బీ అయ్యాను. మ్యాచ్ ముగిసిన తర్వాత అందరం కలిసి మేం బసచేసిన హోటల్ పై అంతస్తులో ఉన్న బార్కి వెళ్లాం. అక్కడ హాలీవుడ్ నటి లిజ్ హార్లీ, షేన్‌వార్న్ కూడా ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ యాజమానుల్లో ఒకరు నా దగ్గరికొచ్చి ‘రాస్ నువ్వు డకౌట్ అయితే నీకు మిలియన్ డాలర్లు ఇవ్వలేం’ అన్నాడు. ఆ తర్వాత అతడు నవ్వేశాడు. అయితే, ఆ దెబ్బలు నాకు గట్టిగా తగల్లేదు. అయితే, అది నాటకమా? నటనా? అన్న విషయం మాత్రం నాకు అర్థం కాలేదు’’ అని టేలర్ తన ఆత్మకథలో రాసుకొచ్చాడు.
ఈ విషయాన్ని తాను అక్కడితోనే వదిలేశానని, దానిని పెద్దది చేయాలని అనుకోలేదని పేర్కొన్నాడు. అయితే, ఫ్రొఫెషనల్ స్పోర్టింగ్ వాతావరణంలో ఇలా జరుగుతుందని తాను ఊహించలేదన్నాడు. కాగా, 2008 నుంచి 2010 వరకు రాయల్ చాలెంజర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రాస్ టేలర్ ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్, పూణె వారియర్స్ జట్లకు ఆడాడు. మొత్తంగా 55 మ్యాచ్‌లు ఆడిన టేలర్ 1,017 పరుగులు చేశాడు.