Rakesh Jhunjhunwala: దలాల్ స్ట్రీట్ బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝన్‌వాలా హఠాన్మరణం
- ఈ తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూత
- రెండుమూడు వారాల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
- ‘ఆకాశ ఎయిర్’తో ఇటీవలే విమానయాన రంగంలోకి
- తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
బిలియనీర్ వ్యాపారవేత్త, స్టాక్ ట్రేడర్, ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. ఈ తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన మరణించినట్టు తెలుస్తోంది. ఉదయం 6.45 గంటల సమయంలో రాకేశ్‌ను ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. రెండుమూడు వారాల క్రితమే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అంతలోనే ఆయన మరణవార్త పారిశ్రామికవేత్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా ‘ఆకాశ ఎయిర్’తో ఇటీవలే విమానయాన రంగంలో అడుగుపెట్టారు. తొలి విమానం ఈ నెల 7న సేవలు ప్రారంభించింది. ఇన్వెస్టర్‌గానే కాకుండా యాప్‌టెక్ లిమిటెడ్, హంగామా డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్‌గానూ ఝున్‌ఝున్‌వాలా అందరికీ సుపరిచితం. అంతేకాదు, పలు సంస్థలకు డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ నేషన్స్‌కు భారత సలహాదారుగానూ ఉన్నారు. రాకేశ్‌కు దాతృత్వం కూడా ఎక్కువే. తన సంపాదనలో 25 శాతాన్ని విరాళంగా ఇస్తున్నారు. హెల్త్‌కేర్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్ వంటి వాటికి విరాళాలు అందిస్తున్నారు.