Karnataka: క్షణాల్లో బిడ్డను పక్కకు లాగేసిన తల్లి.. లేదంటే నాగుపాము కాటు.. వీడియో వైరల్
- కర్ణాటకలోని మండ్యలో జరిగిన ఘటన
- మెట్టు దిగి రోడ్డుపై కాలేసిన బాలుడు
- మెట్టు చాటుగా వెళుతున్న నాగుపాము
- వేగంగా స్పందించి బాలుడ్ని కాపాడిన తల్లి
ఓ మహిళ చాలా వేగంగా స్పందించడం ఆమె కుమారుడి ప్రాణాలను కాపాడిందని చెప్పుకోవాలి. చిన్నారులను ఒంటరిగా బయటకు పంపకూడదని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అవుతుంది. కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన చూసేవారికి కనువిప్పు కలిగిస్తుంది. ఓ ఇంటి ముందు పొడవాటి మెట్లున్నాయి. ఓ పెద్ద త్రాచుపాము చివరి మెట్టు కింద రహదారిపై చిన్నగా పాకుతూ వెళుతోంది. ఇంట్లో నుంచి చూస్తే అది కనిపించదు. ఎందుకంటే మెట్టు చాటుగా అది ఉంది. చివరి మెట్టు కూడా దిగితేనే కనిపిస్తుంది.
చిన్నారి బాలుడు స్కూలుకు వెళుతున్నాడు. తల్లి కూడా అతడికి తోడుగా ఇంటి ముందు వరకు వచ్చి చివరి మెట్టుపై ఆగిపోయి వీధి వైపు చూస్తోంది. బాలుడు కూడా వీధి వైపు చూస్తూ రోడ్డుపై కాలేశాడు. సరిగ్గా ఆ కాలు తాచుపాము మీద నుంచి రోడ్డుపై పడింది. వెంటనే తాచుపాము వెనక్కి వెళ్లి పైకిలేచి బాలుడ్ని కాటు వేయబోయింది. దీన్ని చూసిన ఆ మహిళ వేగంగా ముందుకు వచ్చేసి తన కుమారుడిని పక్కకు లాగేసి, ఎత్తుకుంది. దీంతో ఆ పాము ముందుకు వెళ్లిపోయింది. మహిళ స్పందించడం ఒకటి రెండు సెకన్లు ఆలస్యం అయినా పాము ఆ బాలుడ్ని కాటేసేదే. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలోకి చేరడంతో పెద్ద వైరల్ అవుతోంది.