trs mlas: 50 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాకు రెడీ.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

trs mlas ready resign and face by elections bandi sanjay bjp state chief

  • ఉప ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటన
  • మునుగోడులో బీజేపీ గెలుపు తథ్యమన్న సంజయ్
  • బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని పిలుపు

టీఆర్ఎస్ గడీ బద్దలు కొట్టేందుకు బీజేపీ భారీ ప్రణాళికలతోనే ఉన్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీకి ప్రజల్లో ఆదరణ అయితే ఉంది. కానీ, అది ఓటుగా మారడం లేదన్నది వాస్తవం. దీనికి బీజేపీకి బలమైన కేడర్, సరైన ప్రజాదరణ ఉన్న నాయకులు ఎక్కువగా లేకపోవడం తదితర కారణాలు ఉన్నాయి. కేంద్రంలో మోదీ నేతృత్వంలో బీజేపీ వరుసగా రెండు పర్యాయాలు అధికారం సంపాదించిన తర్వాత పరిస్థితుల్లో కొంత మార్పు వస్తోంది. మోదీ, అమిత్ షా ద్వయం దక్షిణాదిన కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారం లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. 

టీఆర్ఎస్ కేంద్రంలోని మోదీ సర్కారుకు వ్యతిరేక స్వరాన్ని తీసుకోవడం తెలిసిందే. అదే సమయంలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీ ఉనికిని నామమాత్రం చేశారు. ఇది తెలంగాణలో బీజేపీ విస్తరణకు అవకాశం ఇచ్చినట్టు అయింది. దీంతో ఆపరేషన్ తెలంగాణ పేరుతో బీజేపీ చకచకా పావులు కదుపుతోంది. టీఆర్ఎస్ నుంచి వచ్చి బీజేపీలో చేరి హుజూరాబాద్ లో గెలిచిన ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఇతర పార్టీల నేతలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా కమిటీ నడుస్తోంది. 

ఈ కమిటీ తెర వెనుక చురుకుగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత, మునుగోడు శాసనసభ స్థానానికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరబోతున్నారు. మరో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత దాసోజు శ్రవణ్ కూడా బీజేపీలో చేరిపోయారు.

ఈ కమ్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరి, ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. శనివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. ఇంతకాలం కాంగ్రెస్, టీఆర్ఎస్ కు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలు.. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు తథ్యమన్నారు.

  • Loading...

More Telugu News