Corona Virus: కరోనాతో మరో 41 మంది మృతి.. దేశవ్యాప్తంగా 14,092 కొత్త కేసులు
- ఒక్కరోజు ఒక్క కేరళ నుంచే 12 మరణాలు నమోదయ్యాయన్న కేంద్ర ఆరోగ్యశాఖ
- ప్రస్తుతానికి కరోనా కేసుల సంఖ్య నియంత్రణలోనే ఉందని వెల్లడి
- వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా సాగుతోందని ప్రకటన
దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయ సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 14,092 కొత్త కేసులురాగా.. 41 మంది మరణించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం ప్రకటించింది. ప్రస్తుతానికి కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందని.. కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోందని పేర్కొంది. గత 24 గంటల్లో 3,81,861 కరోనా టెస్టులు చేయగా.. 14,092 మందికి పాజిటివ్ గా తేలిందని వెల్లడించింది.
కేరళలో ఎక్కువగా మరణాలు
మొత్తం 41 మంది కరోనాతో మరణించగా.. అందులో ఒక్క కేరళ నుంచే 12 మరణాలు నమోదైనట్టు తెలిపింది. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,27,037కు చేరిందని వివరించింది. మొత్తంగా ఇప్పటివరకు దేశంలో 4.42 కోట్ల కరోనా కేసులు నమోదుకాగా.. 4.36 కోట్ల మంది (98.54%) కోలుకున్నారని తెలిపింది. క్రియాశీల కేసుల సంఖ్య 1,16,861 (0.26%)గా ఉన్నట్టు ప్రకటించింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ విస్తృతంగా కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.