Rakesh Jhunjhunwala: రూ.5,000తో మొదలు పెట్టి.. రూ.44వేల కోట్లకు పడగలెత్తిన ఝున్‌ఝున్ వాలా
- 1985లో స్టాక్స్ జర్నీ మొదలు పెట్టిన బిగ్ బుల్
- టాటా టీలో భారీ లాభాలు
- టైటాన్ లో రూ.7,000 కోట్ల పెట్టుబడులు
- రిస్క్ కు వెనుకాడని తత్వం
దలాల్ స్ట్రీట్ (ముంబైలోని బీఎస్ఈ ఉండే ప్రాంతం) తొలి తరం ఇన్వెస్టర్లలో రాకేశ్ ఝున్‌ఝున్ వాలా ఒకరు. 25 ఏళ్ల వయసులో అంటే 1985లో ఆయన రూ.5,000తో స్టాక్స్ లో పెట్టుబడి మొదలు పెట్టారు. అప్పట్లో రూ.5,000 అంటే భారీ మొత్తమే. కానీ, నేడు ఆయన సంపద విలువ ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇటీవలి అంచనాల ప్రకారం.. 5.5 బిలియన్ డాలర్లు (అంటే సుమారు రూ.44,000 కోట్లు). భారత్ లోని సంపన్నుల్లో విలువ పరంగా రాకేశ్ ది 36వ స్థానం.
ఝున్‌ఝున్ వాలా తండ్రి ఇన్ కమ్ ట్యాక్స్ అధికారిగా పనిచేసేవారు. దాంతో రాకేశ్ ఝున్‌ఝున్ వాలా 1960 జులై 5న హైదరాబాద్ లో జన్మించారు. ముంబైలో ఆయన కుటుంబం స్థిరపడింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారు. వీరి పేరులో ఉన్న ఝున్‌ఝున్ రాజస్థాన్ లోని ఓ గ్రామం పేరు.
రాకేశ్ ఝున్‌ఝున్ వాలాకు స్టాక్ ట్రేడింగ్ అంటే ఆసక్తి ఏర్పడింది. ఆయన తండ్రి నుంచే ఈ వారసత్వం వచ్చిందని చెప్పుకోవాలి. దాన్నే ఫ్యాషన్ గా, ప్రొఫెషన్ గా మార్చుకున్నారు. రిస్క్ తీసుకుని మరీ స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టేవారు. 1986లో టాటా టీ షేర్లలో ఆయన భారీ లాభాలను కళ్లజూశారు. ఒక్కో షేరు రూ.43 వద్ద 5,000 షేర్లు కొన్నారు. మూడు నెలల్లోనే అది రూ.143కు పెరిగిపోయింది. దీంతో మూడు నెలల్లోనే ఆయన పెట్టుబడి మూడింతలైంది. ఆ తర్వాతి మూడేళ్లలో ఆయన రూ.25 లక్షల వరకు సంపాదించారు. అంతే ఇక ఆ తర్వాత స్టాక్స్ లో వెనుతిరిగి చూసింది లేదు.
రాకేశ్ ఝున్‌ఝున్ వాలా పట్టిందల్లా బంగారం కాకపోయినప్పటికీ.. ఆయన కొనుగోలు చేసిన షేర్లలో ఎక్కువ శాతం భారీ లాభాలను ఇచ్చినవే ఉన్నాయి. ‘‘రిస్క్ తీసుకుంటున్నామంటే దానిపట్ల స్పృహతో ఉండాలి. మనం అనుకున్న దానికి రివర్స్ అయితే భరించే శక్తి ఉండాలి. అది భావోద్వేగపరంగా మనపై ప్రభావం చూపించకూడదు’’అని ఓ సందర్భంలో ఆయన చెప్పారు.
భారత దేశ పురోగతి, ప్రగతి పట్ల ఆయన ఎప్పుడూ బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంటారు. కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకొచ్చిన సంస్కరణలకు బలమైన మద్దతుదారుగా ఉన్నారు. దేశ పౌర విమానయాన రంగంలో ‘ఆకాశ ఎయిర్’పేరుతో విమానయాన సేవలను సైతం ఈ నెల 7 నుంచి ప్రారంభించారు. ఇది జరిగిన సరిగ్గా వారానికే ఆయన తుదిశ్వాస విడిచారు. స్టాక్స్ ట్రేడింగ్ లో ఆపరేటర్లతో కుమ్మక్కు అయినట్టు, గ్రూపు ట్రేడింగ్ తో భారీ లాభాలు కూడబెట్టినట్టు ఆయనపై కొన్ని ఆరోపణలు ఉన్నా, అవేవీ నిర్ధారణ కాలేదు.
రాకేశ్ ఝున్‌ఝున్ వాలా పోర్ట్ ఫోలియోలో సుమారు 32 స్టాక్స్ ఉన్నాయని అంచనా. వీటి విలువ సమారు రూ.32,000 కోట్లు. అన్ లిస్టెడ్ కంపెనీల్లోనూ ఆయనకు వాటాలున్నాయి. ప్రాపర్టీలపైనా స్వల్ప పెట్టుబడులు ఉన్నాయి. తన ఆధ్వర్యంలోనే రేర్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో పెట్టుబడుల సంస్థను నిర్వహిస్తున్నారు. తన పేరు, తన భార్య రేఖ ఝున్‌ఝున్ వాలా, తన పెట్టుబడుల సంస్థ రేర్ ఎంటర్ ప్రైజెస్ పేరిట ఆయన పెట్టుబడులు పెడుతుంటారు. ఆయన పెట్టుబడుల్లో సింహ భాగం టైటాన్ లోనే ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.7,000 కోట్లు. మంచి అవకాశం అని భావిస్తే రుణం తీసుకొచ్చి మరీ స్టాక్స్ కొనుగోలు చేసే వాడినంటూ ఆయనే ఓ సందర్భంలో వెల్లడించారు. అందుకనే రాకేశ్ ఝున్‌ఝున్ వాలాను భారత వారెన్ బఫెట్ గా, బిగ్ బుల్ గా పిలుస్తుంటారు.