Mohan Bhagwat: ఇంతటి భిన్నత్వంలోనూ సమర్థంగా నెట్టుకువస్తున్న భారత్ వైపు యావత్ ప్రపంచం చూస్తోంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Mohan Bhagwat comments on diversity

  • నాగ్ పూర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న భగవత్
  • భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ కేంద్రస్థానమని వెల్లడి
  • తెలియని చారిత్రక ఘటనలు చాలా ఉన్నాయని వివరణ
  • కులాలకు అనవసర ప్రాధాన్యత ఇచ్చామని వ్యాఖ్యలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో 'భారత్@2047: మై విజన్ మై యాక్షన్' అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ఎంతో భిన్నత్వం ఉందని, ఇంతటి వైవిధ్యాన్ని సమర్థంగా నెట్టుకొస్తున్న తీరు పట్ల భారత్ వైపు యావత్ ప్రపంచం ఆసక్తిగా తిలకిస్తోందని అన్నారు. ఈ ప్రపంచం పూర్తిగా వైరుధ్యాలతో నిండి ఉందని, అయితే పరస్పర భిన్న అంశాలను ఎలా నిర్వర్తించాలన్న దానికి భారతదేశమే కేంద్రస్థానం అని కీర్తించారు. 

అంతేకాదు, మనకు తెలియని, ఎవరూ సరిగ్గా బోధించని అనేక చారిత్రక సంఘటనలు ఉన్నాయని మోహన్ భగవత్ పేర్కొన్నారు. "ఉదాహరణకు సంస్కృత వ్యాకరణం భారత్ లో ఉద్భవించినది కాదు... ఎందుకలా అని మనం ఏనాడైనా ప్రశ్నించామా?" అని అన్నారు. "ప్రధానంగా చెప్పాలంటే... మొదట మనం మన మేధస్సును, విజ్ఞానాన్ని మర్చిపోయాం. ఆ తర్వాత ఉత్తర-పశ్చిమ దిక్కుల నుంచి వచ్చిన విదేశీ చొరబాటుదారులు మన భూభాగాన్ని ఆక్రమించుకోవడం మరో కారణం" అని మోహన్ భగవత్ వివరించారు. 

"మనం కులాలు, తదితర సారూప్య వ్యవస్థలకు అనవసర ప్రాధాన్యత ఇచ్చాం. పని కోసం ఏర్పడిన ఈ వ్యవస్థలు సమాజాలు, మనుషుల మధ్య విభేదాలు సృష్టించడానికి ఉపయోగపడ్డాయి. మనకు భాష, వేషధారణ, సంస్కృతులు వంటి అంశాల్లో చిన్నపాటి తేడాలు ఉండొచ్చు. అయితే ఇలాంటి స్వల్ప భేదాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లే విశాల హృదయాన్ని అలవర్చుకోవాలి. దేశంలోని అన్ని భాషలు జాతీయ భాషలేనని, వివిధ వర్గాలకు చెందిన ప్రజలంతా నా వాళ్లే అనుకునే ఆప్యాయత మనలో కలగాలి"అని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News