BJP: తమిళనాడు బీజేపీలో చిచ్చు రేపిన ‘చెప్పు’.. పార్టీకి గుడ్‌బై చెప్పిన మధురై చీఫ్
- ఆర్థికమంత్రి త్యాగరాజన్ కారుపై చెప్పు విసిరిన బీజేపీ కార్యకర్త
- మంత్రిని కలిసి క్షమాపణ చెప్పిన డాక్టర్ శరవణన్
- బీజేపీ మతతత్వ పార్టీ అంటూ నిప్పులు
- పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు చెప్పిన తమిళనాడు బీజేపీ చీఫ్
తమిళనాడు మంత్రి పళనివేల్ త్యాగరాజన్ వాహనంపై బీజేపీ కార్యకర్తలు చెప్పు విసిరిన ఘటన కాషాయ పార్టీలో కలకలానికి కారణమైంది. మంత్రి వాహనంపై కార్యకర్తలు చెప్పు విసరడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మధురై నగర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ శరవణన్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఆయన మధురై నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయనను పార్టీ మధురై నగర పార్టీ అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది. తాజాగా, ఆయన పార్టీని వీడుతున్నట్టు ప్రకటించి బీజేపీలో చర్చకు తెరలేపారు.
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలో జరిగిన ఎన్కౌంటర్లో మధురైకి చెందిన రైఫిల్‌మ్యాన్ డి.లక్ష్మణ్ అమరుడయ్యారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు మంత్రి త్యాగరాజన్ వెళ్లారు. అదే కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె. అన్నామలై కూడా వస్తున్న విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే, మిలటరీ ప్రొటోకాల్ ప్రకారం ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఇతర అధికారులు మాత్రమే భాగం కావాలని, లేకపోతే ప్రొటోకాల్ ఉల్లంఘించినట్టు అవుతుందని మంత్రి పేర్కొన్నారు.
మంత్రి ఆదేశాలతో అక్కడికొచ్చిన జనాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలను కూడా అక్కడి నుంచి తరలించాలని మంత్రి ఆదేశించినట్టు వార్త గుప్పుమంది. దీంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరుడు లక్ష్మణ్‌కు మంత్రి నివాళులు అర్పించి తిరిగి వెళ్తుండగా ఆయన వాహనంపైకి చెప్పు విసిరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఐదుగురు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
మంత్రిపై బీజేపీ నేతలు వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెందిన శరవణన్ మంత్రి త్యాగరాజన్‌కు క్షమాపణలు చెప్పాలని నిర్ణయించారు. అర్ధరాత్రి వేళ మంత్రిని కలిసి, సారీ చెప్పారు. అంతటితో ఆగకుండా సొంతపార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ మతతత్వ పార్టీ అని నిప్పులు చెరిగారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు, సొంతపార్టీపైనే తీవ్ర విమర్శలు చేసిన శరవణన్‌ను పార్టీ నుంచి తప్పిస్తున్నట్టు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై పేర్కొన్నారు.