Independence Day: స్వాతంత్ర్య సముపార్జనలో తెలంగాణ వీరులది ఉజ్వలమైన పాత్ర: కేసీఆర్
- గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం
- స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో తెలంగాణ త్రివర్ణ శోభితమైందన్న కేసీఆర్
- తెలంగాణ ప్రజల సామరస్యాన్ని గాంధీ గంగాజమునా తెహజీబ్‌గా అభివర్ణించారన్న సీఎం
- మహనీయుల త్యాగాలను స్మరించుకుందామన్న కేసీఆర్
దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో తెలంగాణ వీరులు ఉజ్వలమైన పాత్రను పోషించారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. అలాంటి వీరుల్లో తుర్రేబాజ్ ఖాన్, రాంజీ గోండు, మౌల్వీ అలావుద్దీన్, సరోజినీ నాయుడు, సంగెం లక్ష్మీబాయి, రామానంద తీర్థ, పీవీ నర్సింహారావు మొదలైనవారు ఉన్నారని గుర్తు చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం అనంతరం మాట్లాడుతూ తెలంగాణ వీరులను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల సామరస్య జీవనశైలిని మహాత్మాగాంధీ గంగా జమునా తెహజీబ్‌గా అభివర్ణించారన్నారు.
స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ మొత్తం త్రివర్ణ శోభితమైందన్నారు. ప్రతి ఇంటిపైనా జెండా ఎగరవేయడంతో తెలంగాణ మొత్తం త్రివర్ణ శోభితంతో మురిసిపోతోందన్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించి స్వేచ్ఛకు, సార్వభౌమాధికారానికి ప్రతీకగా త్రివర్ణ పతాకం ఆవిష్కృతమై నేటితో 75 ఏళ్లు పూర్తవుతున్నాయని కేసీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా మహనీయుల త్యాగాలను స్మరించుకుందామన్నారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ, నవభారత నిర్మాణంలోనూ మహోన్నతమైన పాత్ర పోషించిన జవహర్‌లాల్ నెహ్రూ నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వరకు మహానుభావుల సేవలు చిరస్మరణీయమని కేసీఆర్ కొనియాడారు.