Ushasri Charan: 50 మంది అనుచరులతో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఉషశ్రీ చరణ్.. భక్తుల ఆగ్రహం
- భక్తులతో కిక్కిరిసి పోతున్న తిరుమల
- నిన్న 92 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్న వైనం
- సర్వదర్శనానికి 3 గంటలకు పైగా పడుతున్న సమయం
భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసిపోతోంది. ప్రతి రోజు దాదాపు 70 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి చాలా సమయం పడుతోంది. మరోవైపు వీఐపీల వల్ల భక్తుల ఇబ్బంది మరింత పెరుగుతోంది.
తాజాగా మంత్రి ఉషశ్రీ చరణ్ తిరుమలలో హల్ చల్ చేశారు. 50 మంది అనుచరులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. మరో 10 మంది అనుచరులు సుప్రభాతం టికెట్లు పొందారు. దీంతో, భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ... మంత్రి ఉషశ్రీ చరణ్ ఒత్తిడికి తలొగ్గి టీటీడీ టికెట్లను జారీ చేసిందని భక్తులు మండిపడుతున్నారు. దీని గురించి ప్రశ్నించిన మీడియా ప్రతినిధుల పట్ల ఆమె గన్ మెన్లు దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో ఓ వీడియో జర్నలిస్టును తోసేశారు.
మరోవైపు గత మూడు, నాలుగు రోజులుగా వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లు అన్నీ నిండిపోతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న 92 వేల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు.