Bandi Sanjay: దాడి విషయంలో స్పందించకపోతే గాయపడ్డ మా కార్యకర్తలను 10 నిమిషాల్లో మీ ఆఫీసుకు తీసుకొస్తా: డీజీపీతో ఫోన్లో బండి సంజయ్
- బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తతలు
- దేవరుప్పల మండలంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ
- బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయన్న సంజయ్
- పోలీసులు ఏంచేస్తున్నారంటూ ఆగ్రహం
జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం తెలిసిందే. బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని, పోలీసులు ఏంచేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాదయాత్ర ప్రదేశం నుంచే రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి ఆయన ఫోన్ చేశారు. తమపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏంచేస్తున్నట్టు అని మండిపడ్డారు. తమ కార్యకర్తలకు ఇద్దరికి తలలు పగిలాయని అన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడి విషయంలో పోలీసులు స్పందించకపోతే గాయపడ్డ కార్యకర్తలను 10 నిమిషాల్లో మీ ఆఫీసుకు తీసుకువస్తా... ముఖ్యమంత్రిని రమ్మనండి అంటూ డీజీపీతో అన్నారు.
కొందరు పోలీసు అధికారులు సీఎం కేసీఆర్ కు కొమ్ముకాస్తున్నారని, ఈ ప్రభుత్వం ఉంటే మరో సంవత్సరం ఉంటుందని స్పష్టం చేశారు. తాము ఎంతో ప్రశాంతంగా పాదయాత్ర కొనసాగిస్తున్నామని, శాంతిభద్రతలు నియంత్రించాలన్న యోచన పోలీసులకు లేదని బండి సంజయ్ విమర్శించారు.