Nitish Kumar: నేడు నితీశ్ కుమార్ కేబినెట్ విస్తరణ.. ఆర్జేడీకి లక్కీ చాన్స్!
- ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్
- ఆర్జేడీకి 16 మంత్రి పదవులు, కాంగ్రెస్‌కు రెండు
- నితీశ్ సొంతపార్టీ జేడీయూకు 11 మంత్రి పదవులు
భారతీయ జనతాపార్టీతో అనూహ్యంగా తెగదెంపులు చేసుకుని పూర్వ మిత్రుడు లాలూప్రసాద్ యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేడు తన కేబినెట్‌ను విస్తరించనున్నారు. నేటి ఉదయం 11.30 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇక ఈ విస్తరణలో ఆర్జేడీకి ఏకంగా 16 మంత్రి పదవులు లభించనున్నాయి. బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ అత్యధిక స్థానాలు కలిగి ఉన్న నేపథ్యంలోనే 16 స్థానాలు కేటాయించినట్టు తెలుస్తోంది. అలాగే, నితీశ్ తన సొంతపార్టీ జేడీయూ నుంచి 11 మందికి మంత్రి పదవులు ఇవ్వనున్నారు. అయితే, హోం మంత్రిత్వశాఖ మాత్రం నితీశ్ తన వద్దే ఉంచుకోనుండగా, గతంలో బీజేపీకి కేటాయించిన శాఖలను ఆర్జేడీ మంత్రులకు కేటాయించనున్నట్టు తెలుస్తోంది.
హిందూస్థాన్ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) నేత జితన్ రామ్ మాంఝీకి కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. బీహార్ ‘గ్రాండ్ అలయెన్స్’లో భాగమైన కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులు లభించనున్నాయి. స్వతంత్ర ఎమ్మెల్యే సహా మొత్తం 31 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జమూయి జిల్లాలోని చకాయికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ నితీశ్ కుమార్ గత కేబినెట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పనిచేశారు.