Sourav Ganguly: వరుసగా కెప్టెన్లను మార్చడం ఎందుకు?.. కారణాలు చెప్పిన గంగూలీ
- అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడేవారికి గాయాలవుతాయన్న గంగూలీ
- వారికి మధ్యలో విరామం ఇవ్వాల్సి వస్తుందని వెల్లడి
- ఇది కొత్త ఆటగాళ్లకు అవకాశాలు తెచ్చిందన్న బీసీసీఐ చీఫ్
భారత క్రికెట్ జట్టుకు సారథ్యం వహించే సామర్థ్యం ఉన్న వారు పెరిగిపోయారు. బీసీసీఐ వరుసగా సీనియర్లకు ఒకరి తర్వాత ఒకరికి కెప్టెన్ గా అవకాశాలు ఇస్తోంది. అన్ని ఫార్మాట్లకు రోహిత్ శర్మ సారథిగా ఉన్నాడు. అయినా, మధ్య మధ్యలో హార్థిక్ పాండ్యా, రిషబ్ పంత్, శిఖర్ ధావన్, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ కు బీసీసీఐ అవకాశాలు ఇస్తోంది.
భవిష్యత్తు సారథి కోసం బీసీసీఐ వరుస ప్రయోగాలు చేస్తోందని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఇదే ప్రశ్న బీసీసీఐ చీఫ్ గంగూలీకి ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ.. అంతర్జాతీయ మ్యాచుల్లో ఎక్కువగా ఆడే వారికి గాయాలయ్యే రిస్క్ ను ప్రస్తావించాడు. వారికి మధ్యలో విశ్రాంతి అవసరమని, ఇది మరింత మంది ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు వెసులుబాటు ఇచ్చినట్టు చెప్పాడు.
‘‘రోహిత్ శర్మ ఇప్పుడు అన్ని ఫార్మాట్లకు కెప్టెన్. గాయాల సమయంలో విశ్రాంతి ఇవ్వాల్సి రావడంతో అది కొత్త ఆటగాళ్లకు అవకాశంగా మారింది. కొత్త ఆటగాళ్లతోనే వెస్టిండీస్, ఇంగ్లండ్ పై గెలిచాం. భారత్ వద్ద ఇప్పుడు 30 మంది ఆటగాళ్ల పూల్ ఉంది. వీరంతా ఎప్పుడైనా జాతీయ జట్టుకు ఆడగలరు’’ అని గంగూలీ చెప్పాడు.