Artjuna Ranatunga: క్రికెట్ దిగ్గజం అర్జున రణతుంగపై రూ.200 కోట్లకు దావా వేయాలని శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయం
- బోర్డుపై రణతుంగ విమర్శలు
- అత్యంత అవినీతిమయం అంటూ వ్యాఖ్యలు
- రణతుంగ వ్యాఖ్యలపై ఎస్ఎల్ సీ ఆగ్రహం
- బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం
శ్రీలంక క్రికెట్ పరిస్థితులపై మాజీ సారథి అర్జున రణతుంగ దారుణమైన వ్యాఖ్యలు చేశాడంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్ సీ) మండిపడుతోంది. ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో తప్పుడు ప్రకటనలు చేసినందుకు అర్జున రణతుంగపై 200 కోట్ల (శ్రీలంక రూపాయలు)కు దావా వేయాలని ఎస్ఎల్ సీ నిర్ణయించింది. ఈ మేరకు లెటర్స్ ఆఫ్ డిమాండ్ (ఎల్ఓడీ) పంపించినట్టు బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది.
రణతుంగ వ్యాఖ్యలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని సోమవారం జరిగిన ఎస్ఎల్ సీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపింది. శ్రీలంక క్రికెట్లోని సుహృద్భావపూరిత వాతావరణాన్ని దెబ్బతీసేలా, రణతుంగ ఉద్దేశపూర్వకంగా క్రికెట్ బోర్డుపై ద్వేష భావనలు గుప్పించాడని ఆరోపించింది.
గత కొంతకాలంగా శ్రీలంక క్రికెట్ పతనం కావడం, బోర్డు వ్యవహారాల్లో స్థిరత్వం లేకపోవడం, అవినీతి వంటి విషయాలపై అర్జున రణతుంగ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దేశంలో అత్యంత అవినీతిమయమైన వ్యవస్థ ఏదైనా ఉందా అంటే అది శ్రీలంక క్రికెట్ బోర్డేనని రణతుంగ వ్యాఖ్యానించారు. బోర్డులో ప్రతి అంశం గందరగోళంగా మారిందని అన్నారు. యువ ప్రతిభావంతులను గుర్తించి, ప్రోత్సహించడంలో బోర్డు పరమచెత్తగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ఎస్ఎల్ సీకి ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తోంది. కాగా, గతంలో శ్రీలంక జట్టుకు వరల్డ్ కప్ అందించిన అర్జున రణతుంగ ఇటీవలే జాతీయ స్పోర్ట్స్ కౌన్సిల్ కు చైర్మన్ గా నియమితులయ్యారు.