Gorantla Madhav: గోరంట్ల మాధవ్ అంశంలో సీబీఐకి ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది
- సంచలనం సృష్టించిన మాధవ్ వీడియో కాల్
- తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ
- అది మార్ఫింగ్ వీడియో అంటూ మాధవ్ వాదన
- సీబీఐకి ఈ-మెయిల్ పంపిన న్యాయవాది లక్ష్మీనారాయణ
- విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఇటీవల వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ వ్యవహారం ప్రకంపనలు సృష్టించడం తెలిసిందే. ఆ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవ్ అని టీడీపీ అంటుండగా, మార్ఫింగ్ చేశారని గోరంట్ల మాధవ్ వాదిస్తున్నారు. ఆ వీడియోకు అమెరికాలో ఫోరెన్సిక్ టెస్టు చేయించామని, అది ఒరిజనల్ అని టీడీపీ స్పష్టం చేస్తోంది. కులాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ మాధవ్ ప్రతిస్పందించారు.
ఈ నేపథ్యంలో, మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో ఏపీ హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆయన తన ఫిర్యాదును ఈ-మెయిల్ ద్వారా చెన్నైలోని సీబీఐ కార్యాలయానికి పంపారు. ఫిర్యాదుతో పాటు మాధవ్ కు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ లను కూడా జతచేశారు. మాధవ్ వ్యాఖ్యలతో రెండు వర్గాల మధ్య విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాధవ్ వ్యవహారంలో దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది లక్ష్మీనారాయణ సీబీఐని కోరారు.