Transgenders: ఛత్తీస్ గఢ్ పోలీసుల బస్తర్ ఫైటర్స్ యూనిట్లో 9 మంది ట్రాన్స్ జెండర్లకు చోటు
- మావోలపై పోరులో కీలక యూనిట్
- 2020లో బస్తర్ ఫైటర్స్ యూనిట్ ఏర్పాటు
- ఇటీవల రిక్రూట్ మెంట్.. ట్రాన్స్ జెండర్లకూ అవకాశం
- లింగ వివక్ష రూపుమాపే దిశగా ఛత్తీస్ గఢ్ పోలీసుల ప్రయత్నం
దేశంలో సామాజిక సమస్యగా మారిన లింగ వివక్ష అంశాన్ని రూపుమాపే దిశగా ఛత్తీస్ గఢ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ బస్తర్ ఫైటర్స్ ప్రత్యేక యూనిట్లో 9 మంది ట్రాన్స్ జెండర్లకు స్థానం కల్పించారు. బస్తర్ ఫైటర్స్ యూనిట్ ను మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మోహరించనున్నారు.
బస్తర్ ఫైటర్స్ యూనిట్ నియామకాల కోసం ఇటీవల రిక్రూట్ మెంట్ నిర్వహించగా, మొత్తం 608 మంది ఎంపికయ్యారు. వారిలో 8 మంది ట్రాన్స్ జెండర్లు కాంకేర్ జిల్లాకు చెందినవారు కాగా, మరో ట్రాన్స్ జెండర్ ది బస్తర్ జిల్లా. ఈ ట్రాన్స్ జెండర్లు కానిస్టేబుల్ హోదాలో పోలీసు ఉద్యోగాలు పొందారు. వీరికి రాయపూర్ లోని పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు.
ఛత్తీస్ గఢ్ లో గిరిజన ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు. మావోలపై పోరులో స్థానికుల సహకారం ఎంతో అవసరం. స్థానిక ప్రజలకు, పోలీసు బలగాలకు మధ్య సమన్వయకర్తలుగా బస్తర్ ఫైటర్స్ వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే 2020లో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం స్పెషల్ యూనిట్ కు రూపకల్పన చేసింది.