Rambabu: మహిళలే అతడి టార్గెట్... సైకో కిల్లర్ రాంబాబును అరెస్ట్ చేసిన పోలీసులు
- వారం రోజుల్లో మూడు హత్యలు చేసిన రాంబాబు
- 2018లో భార్య వివాహేతర సంబంధం
- మానసికంగా కుంగిపోయిన రాంబాబు
- అప్పటినుంచి మహిళలంటే కక్ష
- మహిళలే లక్ష్యంగా హత్యాకాండ
పెందుర్తిలో వరుస హత్యల మిస్టరీని విశాఖ పోలీసులు ఛేదించారు. వారం రోజుల వ్యవధిలో మూడు హత్యలు జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో, ఈ సీరియల్ మర్డర్లను సవాల్ గా తీసుకున్న పోలీసులు, సైకో కిల్లర్ రాంబాబును అరెస్ట్ చేశారు. దీనిపై పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ స్పందించారు. సైకో కిల్లర్ ను అదుపులోకి తీసుకున్నామని, నిందితుడు అనకాపల్లి జిల్లా కోటవురట్ల గ్రామవాసి అని తెలిపారు.
2018లో భార్య వివాహేతర సంబంధం వల్ల రాంబాబు తీవ్ర ఒత్తిడికి లోనై మానసికంగా కుంగిపోయాడని వివరించారు. అప్పటినుంచి మహిళలపై కక్ష పెంచుకుని హత్యలకు పాల్పడుతున్నాడని సీపీ తెలిపారు. రాంబాబు వారం కిందట వాచ్ మన్ దంపతులను హత్య చేశాడని వెల్లడించారు. ఆ తర్వాత మరో మహిళను హత్య చేశాడని, మరొకరిపై హత్యాయత్నం చేశాడని వివరించారు.
కొన్నినెలలుగా రాంబాబు మానసిక పరిస్థితి బాగోలేదని అన్నారు. తను అద్దెకు ఉంటున్న ఇంట్లో క్షుద్రపూజలు చేసేవాడని, దేవుడు వస్తున్నాడంటూ కేకలు వేసేవాడని పోలీస్ కమిషనర్ తెలిపారు. అతడిని కోర్టులో హాజరు పరిచి కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతామని చెప్పారు.
రాంబాబుకు 30 ఏళ్ల కిందట పెళ్లయింది. అతడికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య వివాహేతర సంబంధం నేపథ్యంలో మానసికంగా దెబ్బతిన్న రాంబాబు... రియల్ ఎస్టేట్ రంగంలో ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో యజమాని చేతిలో మోసపోవడంతో మరింత కుంగిపోయాడు. అక్కడ్నించే హత్యలకు శ్రీకారం చుట్టాడు. హత్య చేసిన తర్వాత మృతుల మర్మాంగాలపై తన్నేవాడు.
భార్యకు విడాకులు ఇచ్చాక అతడిని కుమార్తె, కుమారుడు కూడా దూరంగా ఉంచడంతో వ్యక్తుల పట్ల ద్వేషం మరింత పెరిగింది. వాచ్ మన్ దంపతుల హత్య కేసు విచారణ చేపట్టిన పోలీసులు... నిందితుడి వద్ద మొబైల్ ఫోన్ లేకపోవడంతో విచారణ వేగంగా సాగించలేకపోయారు. అయితే పొదల్లోంచి వస్తున్న రాంబాబును ప్రశ్నించగా, అతడు చెప్పిన సమాధానాలు పోలీసుల్లో అనుమానాలు రేకెత్తించాయి. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే మహిళలపై హత్యాకాండ వెల్లడైంది.