MLC Ananthababu: అనంతబాబుకు బెయిలు కోసం ప్రభుత్వమే ప్రయత్నించడం దురదృష్టకరం: ఏపీ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల
- దళిత యువకుడు సుబ్రహ్మణ్యం కేసులో నిందితుడిగా ఎమ్మెల్సీ అనంతబాబు
- రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా’ సక్రమంగా లేదన్న ముప్పాళ్ల
- ఈ నెల 20లోపు చార్జ్‌షీట్ దాఖలు చేయకుంటే బెయిలు వస్తుందని ఆవేదన
- నిందితుడికి పోలీసులే సహకరిస్తున్నారని విమర్శ
కాకినాడ దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకేసు నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిలు కోసం ప్రభుత్వమే ప్రయత్నించడం దురదృష్టకరమని ఏపీ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా’ సవ్యంగా అమలు జరగడం లేదని చెప్పేందుకు ఇంతకుమించిన ఉదాహరణ అవసరం లేదని విమర్శించారు. ఈ నెల 20తో నిందితుడిని రిమాండ్‌కు పంపి 90 రోజులు అవుతుందన్న ఆయన.. ఈలోగా చార్జ్‌షీట్ దాఖలు చేయకపోతే అనంతబాబుకు చట్ట ప్రకారం బెయిలు లభిస్తుందన్నారు.
నిందితుడికి పోలీసులు మొదటి నుంచి అండదండలు అందిస్తూనే ఉన్నారని ఆరోపించారు. అనంతబాబు మూడో బెయిలు పిటిషన్‌పై వాదనలకు గడువుకావాలని అతడి తరపు న్యాయవాది కోరడంతో విచారణ రెండుసార్లు వాయిదా పడిందని ముప్పాళ్ల సుబ్బారావు పేర్కొన్నారు. అనంతబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.