Sachin Tendulkar: నా ఆర్థిక కష్టాల గురించి సచిన్ కు తెలుసు: వినోద్ కాంబ్లీ

Sachin Tendulkar knows everything but Iam not expecting anything Vinod Kambli

  • క్రికెట్ కు సంబంధించి ఏదైనా పని ఇప్పించాలన్న కాంబ్లీ
  • ముంబై క్రికెట్ అసోసియేషన్ కు అభ్యర్థన
  • బీసీసీఐ పెన్షన్ ఒక్కటే కుటుంబాన్ని పోషిస్తుందన్న మాజీ క్రికెటర్

వినోద్ కాంబ్లీ, సచిన్ టెండుల్కర్ మంచి స్నేహితులన్నది చాలా మందికి తెలిసిన విషయం. సచిన్ క్రికెట్ దిగ్గజంగా రాణించగా.. మంచి ప్రతిభ కలిగిన కాంబ్లీ కెరీర్ లో దీర్ఘకాలం పాటు కొనసాగలేకపోయాడు. తన ఆర్థిక కష్టాల గురించి తాజాగా కాంబ్లీ నోరు విప్పాడు. క్రికెట్ కు సంబంధించిన బాధ్యతలు ఏవైనా తనకు అప్పగిస్తే చేయాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. తనకు బీసీసీఐ నుంచి వచ్చే పెన్షన్ మినహా మరే ఆదాయం లేదన్నాడు.

బీసీసీఐ నుంచి కాంబ్లీకి ప్రతి నెలా రూ.30,000 పెన్షన్ వస్తుంటుంది. మొన్నటివరకు కాంబ్లీ నేరుల్ లో 'టెండుల్కర్ మిడిల్ సెక్స్ గ్లోబల్ అకాడమీ'లో యువ క్రికెటర్లకు మెంటార్ గా పనిచేసేవాడు. కానీ, నేరుల్ ప్రయాణానికి చాలా దూరంగా ఉంటుందని కాంబ్లీ తెలిపాడు. ‘‘ఉదయం 5 గంటలకు నిద్రలేచి క్యాబ్ తీసుకుని డీవై పాటిల్ స్టేడియానికి వెళ్లాలి. రోజంతా హడావుడి. అక్కడి నుంచి బీకేసీ గ్రౌండ్ లో సాయంత్రం శిక్షణ ఇవ్వాలి’’ అని వివరించాడు.

ఇప్పుడు బీసీసీఐ నుంచి వస్తున్న పెన్షన్ ఒక్కటే తన కుటుంబాన్ని పోషిస్తోందన్న కాంబ్లీ, అందుకు బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపాడు. ‘‘ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) సాయం కోరాను. వాంఖడే స్టేడియం లేదా బీకేసీ స్టేడియం అయినా అందుబాటులో ఉంటానని చెప్పాను. ముంబై క్రికెట్ నాకు ఎంతో ఇచ్చింది. ఈ ఆట కోసం ప్రాణం ఇస్తాను. నాకు ఏదైనా పని కావాలి. ఎంసీఏ నుంచి అదే కోరుకుంటున్నాను’’ అని వివరించాడు.

తన ఆర్థిక కష్టాల గురించి చిన్ననాటి స్నేహితుడైన సచిన్ కు తెలుసా? అన్న ప్రశ్నకు.. ‘‘అతడికి అన్నీ తెలుసు. కానీ, నేను అతడి నుంచి ఏమీ ఆశించడం లేదు. అతడు నాకు 'టెండుల్కర్ మిడిల్ సెక్స్ గ్లోబల్ అకాడమీ'లో బాధ్యతలు కేటాయించాడు. దీనికి ఎంతో సంతోషపడ్డాను. అతడు నాకు ఎంతో మంచి స్నేహితుడు. నాకోసం ఎప్పుడూ ఉంటాడు’’ అని కాంబ్లీ తెలిపాడు. ముంబై జట్టు కోరుకుంటే తాను సైతం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పాడు.

  • Loading...

More Telugu News