China: శ్రీలంక పోర్టులో తమ గూఢచార నౌక మకాం వేయడంపై చైనా స్పందన ఇదే!
- హంబన్ టోటా పోర్టులో బెర్త్ అయిన యువాన్ వాంగ్ 5
- ఇది కేవలం రీసర్చ్ వెహికల్ మాత్రమే అన్న చైనా
- ఏ దేశ భద్రతకూ విఘాతం కలిగించదని వ్యాఖ్య
- అవసరమైన వాటిని నింపుకోవడానికి నౌకకు కొంత సమయం పడుతుందన్న చైనా
- శ్రీలంక అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చేందుకు కొన్ని దేశాలు యత్నిస్తున్నాయని విమర్శ
శ్రీలంకలోని హంబన్ టోటా పోర్టులో చైనాకు చెందిన గూఢచార నౌక యువాన్ వాంగ్ 5 మకాం వేసిన సంగతి తెలిసిందే. భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ అది శ్రీలంకకు చేరుకుంది. భారత్ ప్రయోగించే మిసైళ్లను ట్రాక్ చేయడమే కాక, మహాసముద్రాలను కూడా ఈ నౌక సర్వే చేస్తుంది. అంతేకాదు జలాంతర్గాములకు తన వంతు సేవలను అందిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
మరోవైపు ఈ నౌక స్పై షిప్ కాదని... రీసర్చ్ వెహికల్ మాత్రమేనని చైనా అంటోంది. తమ హైటెక్ రీసర్చ్ వెస్సెల్ వల్ల ఏ దేశ భద్రతకూ విఘాతం కలగదని చెపుతోంది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ... శ్రీలంక సహకారంతో హంబన్ టోటా పోర్టులో యువాన్ వాంగ్ 5 బెర్త్ అయిందని చెప్పారు. హంబన్ టోటా పోర్టులో తమ నౌకకు శ్రీలంకలోని చైనా రాయబారి స్వాగతం పలికారని తెలిపారు. శ్రీలంకకు ఇచ్చిన అప్పులను జమ చేసుకునే ప్రక్రియలో ఈ పోర్టును చైనా 99 ఏళ్లకు లీజుకు తీసుకున్న సంగతి తెలిసిందే. 2017లో పోర్టును స్వాధీనం చేసుకుంది.
మరోవైపు, అంతర్జాతీయ చట్టాలకు, నిబంధనలకు లోబడే యువాన్ వాంగ్ 5 నౌక మెరైన్ సైంటిఫిక్ రీసర్చ్ చేస్తుందని వాంగ్ వెన్బిన్ తెలిపారు. ఏ దేశ భద్రతను కానీ, ఆర్థిక కార్యకలాపాలకు కానీ విఘాతం కలిగించదని చెప్పారు. హంబన్ టోటా పోర్టులో అవసరమైన వాటిని నింపుకోవడానికి ఈ నౌకకు కొంత సమయం పడుతుందని తెలిపారు.
తమ దేశానికి ఈ నౌకను పంపడాన్ని వాయిదా వేసుకోవాలని శ్రీలంక చెప్పింది కదా అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తల్లో నిజం లేదని అన్నారు. శ్రీలంక అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడానికి, ఆ దేశంపై ఒత్తిడి తెచ్చేందుకు కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని పరోక్షంగా భారత్ పై విమర్శలు గుప్పించారు.
మరోవైపు చైనా మీడియా కథనాల ప్రకారం ఈ నౌకలో 2 వేల మంది సిబ్బంది పని చేస్తుంటారు. శాటిలైట్లను, ఖండాతర క్షిపణులను ఇది తనలో ఉన్న ఆధునిక వ్యవస్థలతో ట్రాక్ చేస్తుంది.