COVID19: దేశంలో నియంత్రణలోనే కరోనా వైరస్
- వరుసగా రెండో రోజు 10 వేల లోపు కేసులు
- గత 24 గంటల్లో 9,062 కేసుల నమోదు
- ప్రస్తుతం 1,05,058 క్రియాశీల కేసులు
దేశంలో కరోనా వైరస్ నియంత్రణలోనే ఉంది. వరుసగా రెండో రోజు పది వేల లోపు కేసులే నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 9,062 కేసులు వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. అదే సమయంలో 15,220 మంది వైరస్ నుంచి కోలుకున్నారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1,05,058 క్రియాశీల కేసులు ఉన్నాయని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.49 శాతంగా ఉందని తెలిపింది. క్రియాశీల కేసుల రేటు 0.24 శాతంగా ఉంది.
కరోనా నుంచి ఇప్పటిదాకా దేశంలో 4,36,54,064 మంది కోలుకున్నారని వెల్లడించింది. రికవరీ రేటు 98.57 శాతంగా ఉంది. కరోనా వల్ల ఇప్పటిదాకా 5,27,134 మంది మృతి చెందారు. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. ఇక దేశంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీ జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 208,57,15,251 డోసుల వ్యాక్సిన్లు అందజేశారు. నిన్న ఒక్క రోజే 25,90,557 మందికి వ్యాక్సిన్లు వేశారు.