India: అవన్నీ పుకార్లే అంటున్న బీసీసీఐ బాస్ గంగూలీ
- ఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో పోటీపై స్పందించిన భారత మాజీ కెప్టెన్
- పోటీ చేసే అంశం తన చేతుల్లో లేదని వెల్లడి
- బీసీసీఐ, ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్న సౌరవ్
తాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎన్నికల్లో పోటీ పడబోతున్నట్లు వస్తున్న వార్తలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. అవన్నీ పుకార్లే అని కొట్టిపారేశాడు. ఈ పదవిపై తనకు ఆసక్తి లేదని, తాను పోటీ పడటం లేదని స్పష్టం చేశాడు. దాంతో, ఐసీసీ చైర్మన్ రేసులో అందరికంటే ముందంజలో ఉన్నాడని వచ్చిన వార్తలపై దాదా నీళ్లు కుమ్మరించాడు. చైర్మన్గా పోటీ చేసే అంశం తన చేతుల్లో కూడా లేదని, బీసీసీఐ, ప్రభుత్వం పరిధిలో ఉంటుందని గంగూలీ చెప్పాడు.
‘ఐసీసీ చైర్మన్ ఎన్నికల రేసులో నేను లేను. ఈ ఎన్నికల్లో పోటీపడే అంశం నా పరిధిలో లేదు. ఈ విషయంలో ఏం చేయాలన్నా బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వాలే తగిన నిర్ణయం తీసుకుంటాయి. నా విషయంలో ఇప్పుడు వస్తున్నవన్నీ పుకార్లే . ఇందులో ఎలాంటి నిజం లేదు. మీరు అనుకుంటున్నట్లుగా ఏదీ జరగదు’ అని భారత మాజీ కెప్టెన్ గంగూలీ వ్యాఖ్యానించాడు.
ప్రస్తుతం ఐసీసీ చైర్మన్గా కొనసాగుతున్న గ్రెగ్ బార్క్ లే పదవీ కాలాన్ని 2024 వరకు పొడిగించడంతో తదుపరి చైర్మన్ గా పోటీకి గంగూలీ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. అవసరం అయితే మాత్రం ఐసీసీ అగ్రపీఠంపైకి గంగూలీ వచ్చే అవకాశం ఉందని భారత క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే 2011 వన్డే ప్రపంచ కప్ నకు భారత్ ఆతిథ్యమిచ్చిన సమయంలో శరద్ పవార్ ఐసీసీ అధినేతగా ఉన్నాడు. వచ్చే ఏడాది భారత్ లోనే వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఐసీసీకి మరోసారి భారత్ కు చెందిన వ్యక్తే చైర్మన్ గా ఉంటాడన్న అభిప్రాయాలున్నాయి.