Narendra Modi: మీ మాటలకు, చేతలకు మధ్య వ్యత్యాసాన్ని దేశం మొత్తం చూస్తోందంటూ మోదీపై రాహుల్ గాంధీ ట్వీట్
- బిల్కిస్ బానో రేపిస్టులను విడుదల చేయడంపై రాహుల్ ఆగ్రహం
- దేశ మహిళలకు ఇచ్చే సందేశం ఇదేనా అని ప్రశ్నించిన రాహుల్
- క్షమాభిక్ష లభించడంతో గోద్రా సబ్ జైలు నుంచి విడుదలైన 11 మంది నిందితులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్కిస్ బానో రేపిస్టులను జైలు నుంచి విడుదల చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. గుజరాత్ ప్రభుత్వ క్షమాభిక్ష పాలసీ ప్రకారం బిల్కిస్ బానో రేపిస్టులు గోద్రా సబ్ జైలు నుంచి విడుదలైన తర్వాత రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీచెప్పేదొకటి, చేసేది మరొకటి అని, దీన్ని దేశం మొత్తం చూస్తోందని అన్నారు.
‘ఐదు నెలల గర్భిణిపై అత్యాచారం చేసి, మూడేళ్ల కూతురును చంపిన వారిని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమయంలో విడుదల చేశారు. మహిళా శక్తి గురించి మాట్లాడుతున్న మోదీ దేశ మహిళలకు ఇచ్చే సందేశం ఏమిటి? ప్రధాని గారూ, మీ మాటలకు, చేతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని దేశం మొత్తం చూస్తోంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
2002 గోద్రా అల్లర్ల అనంతరం జరిగిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ ఘటనలో ఏడుగురిని హత్య చేసిన కేసులో 11 మంది నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడింది. అయితే, గుజరాత్ ప్రభుత్వం వీళ్లందరికి క్షమాభిక్ష ఇచ్చింది. ఈ పదకొండు మంది సోమవారం గోద్రా సబ్-జైలు నుండి బయటకు వచ్చారు.