Prashant Kishor: అదే జరిగితే నితీశ్ కుమార్ కు పూర్తి మద్దతును ఇస్తా.. నా క్యాంపెయిన్ ను కూడా ఆపేస్తా: ప్రశాంత్ కిశోర్
- 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్
- సీఎం సీటుకు అతుక్కుపోవడానికి నితీశ్ ఫెవికాల్ వాడతారంటూ పీకే ఎద్దేవా
- రాబోయే రోజుల్లో బీహార్ లో ఎన్నో రాజకీయ తిరుగుబాట్లను చూస్తామని వ్యాఖ్య
బీహార్ లో నితీశ్ కుమార్ కు చెందిన జేడీయూ, తేజస్వి యాదవ్ కు చెందిన ఆర్జేడీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని వీరి మహాఘటబంధన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, బీహార్ కు చెందిన ప్రశాంత్ కిశోర్ స్పందించారు. వీరు ప్రకటించినట్టు 10 లక్షల ఉద్యోగాలను ఒకటి లేదా రెండేళ్లలో కల్పిస్తే తాను నితీశ్ కుమార్ కు పూర్తిగా మద్దతును ప్రకటిస్తానని చెప్పారు. అంతేకాదు, తాను చేపట్టిన 'జన్ సూరజ్ అభియాన్' క్యాంపెయిన్ కార్యక్రమాన్ని కూడా ఆపేస్తానని తెలిపారు.
బీహార్ లోని సమస్తిపూర్ లో తన మద్దతుదారులతో ఆయన మాట్లాడుతూ... నితీశ్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. సీఎం పదవికి అతుక్కుపోవడానికి నితీశ్ కుమార్ ఫెవికాల్ ను వాడతారని ఎద్దేవా చేశారు. మిగిలిన పార్టీలు ఆ సీటు చుట్టూ తిరుగుతుంటాయని అన్నారు. తాను బీహార్ రాజకీయాల్లోకి ప్రవేశించి కేవలం మూడు నెలలు మాత్రమే అవుతోందని... ప్రస్తుతం బీహార్ రాజకీయాలు 180 డిగ్రీల మలుపు తీసుకున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎన్నో రాజకీయ తిరుగుబాట్లను చూస్తామని జోస్యం చెప్పారు.
గతంలో ప్రశాంత్ కిశోర్ జేడీయూలో ఉన్నారు. నితీశ్ ఆయనకు కీలకమైన పదవిని ఇచ్చారు. అయితే, నితీశ్ కుమార్ తో తలెత్తిన విభేదాల వల్ల ఆ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో జన్ సూరజ్ అభియాన్ క్యాంపెయిన్ ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. బీహార్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం, వాటికి పరిష్కారాలను వెతకడమే ఈ క్యాంపెయిన్ ప్రధాన లక్ష్యం.