Gujarat: గుజరాత్ లో రూ.1,125 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
- వడోదరలో నిర్మాణంలోని ఫ్యాక్టరీపై దాడి
- 225 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం
- ఫ్యాక్టరీ భాగస్వాములతో పాటు ఆరుగురి అరెస్ట్
భారీ విలువ చేసే మత్తు పదార్థాలను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) స్వాధీనం చేసుకుంది. వడోదర పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీపై దాడి చేయగా.. 225 కిలోల మెఫెడ్రోన్ బయటపడింది. దీని విలువ రూ.1,125 కోట్లు ఉంటుందని అంచనా.
ఫ్యాక్టరీ భాగస్వాములు ఐదుగురితోపాటు, దినేష్ ధృవ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను బరూచ్ జిల్లా సాంఖ్య జీఐడీసీలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో తయారు చేసినట్టు తెలిసింది. ధృవ్ నార్కోటిక్స్ కేసులో గతంలో 12 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించినట్టు గుర్తించారు.