Roja: తిరుమలలో రోజా హల్ చల్.. 50 మంది అనుచరులకు బ్రేక్ దర్శనం
- ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ
- 50 మంది అనుచరులతో తిరుమల దర్శనానికి వచ్చిన రోజా
- వీరి బ్రేక్ దర్శనం వల్ల గంటకు పైగా ఇబ్బంది పడ్డ భక్తులు
తిరుమల కొండపై కొందరు ఏపీ మంత్రులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రతి రోజు వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది. అయితే, కొందరు మంత్రులు భారీ సంఖ్యలో అనుచరగణంతో వచ్చి బ్రేక్ దర్శనాలు చేయిస్తున్నారు. దీంతో, సాధారణ భక్తులకు ఇబ్బంది మరింత పెరుగుతోంది.
ఈ నెల 21వ తేదీ వరకు అన్ని బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వీఐపీ సిఫారసులను కూడా రద్దు చేసింది. అయితే, ఈ నిబంధనలను పక్కనపెట్టి మంత్రి రోజా ఈరోజు 50 మంది అనుచరులకు బ్రేక్ దర్శనం చేయించారు. దీంతో గంటకు పైగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. రోజా తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ అధికారులపై ఒత్తిడి తెచ్చి బ్రేక్ దర్శనం చేయించారని మండిపడుతున్నారు. ఇటీవలే మరో మంత్రి ఉషశ్రీ చరణ్ కూడా ఇదే విధంగా వ్యవహరించి విమర్శలపాలు అయిన సంగతి తెలిసిందే.