Centre: దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న యూట్యూబ్ చానళ్లపై వేటు
- ఏడు వార్తా చానళ్లు, పాక్ కేంద్రంగా పనిచేసే మరో చానల్ పై నిషేధం
- భారత్ వ్యతిరేక, తప్పుదోవ పట్టించే కంటెంట్ ప్రసారం
- మతసామరస్యాన్ని దెబ్బతీసే యత్నం
దేశ వ్యతిరేక కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ఎనిమిది యూ ట్యూబ్ న్యూస్ చానళ్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇందులో ఒకటి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తోంది. భారతదేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, శాంతి భద్రతలకు వ్యతిరేకంగా సమాచారాన్ని ఇవి వ్యాప్తి చేస్తున్నట్టు గుర్తించడంతో ఈ చర్య తీసుకుంది.
బ్లాక్ చేసిన యూట్యూబ్ చానళ్లకు 114 కోట్ల వ్యూస్ ఉన్నాయి. వీటికి 85.77 లక్షల మంది సబ్ స్క్రయిబర్లుగా ఉన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు-2021 కింద వీటిని బ్లాక్ చేసింది. బ్లాక్ చేసిన ఎనిమిదింటిలో ఏడు న్యూస్ చానళ్లు.
మతపరమైన కట్టడాలను భారత ప్రభుత్వం కూల్చివేసిందని, మత వేడుకల నిర్వహణపై నిషేధం విధించిందని, మతపరమైన యుద్ధాన్ని ప్రకటించిందని ఇలా రకరకాలుగా భారత వ్యతిరేక కంటెంట్ ను ఇవి ప్రసారం చేస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. అంతేకాదు, జమ్మూ కశ్మీర్లో భారత సాయుధ బలగాలకు సంబందించి నకిలీ వార్తలను ప్రసారం చేసినట్టు తెలిసింది. ఈ తరహా కంటెంట్ మత సామరస్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, ప్రజా జీవనానికి భంగం కలిగిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.