WIPRO: మూడ్నెల్లకోసారి ప్రమోషన్లపై స్పష్టత నిచ్చిన విప్రో
- ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో తగ్గిన విప్రో లాభాలు
- వేరియబుల్ పేపై ఇప్పుడేమీ చెప్పలేమని వెల్లడి
- ఉద్యోగుల జీతాల పెంపును నిలిపివేయడంలేదని స్పష్టీకరణ
- ఇప్పటికే తొలిదశ ప్రమోషన్లు పూర్తి
ప్రముఖ దేశీయ ఐటీ సంస్థ విప్రో తమ ఉద్యోగుల వేతనాల్లో భాగమైన వేరియబుల్ పేను నిలిపివేస్తున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ లాభాలు తగ్గినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ కథనాల్లో పేర్కొన్నారు. దీనిపై విప్రో వర్గాలు స్పందించాయి. సెప్టెంబరు 1వ తేదీ నుంచి అమలు చేయాల్సిన ఉద్యోగుల జీతాల పెంపును తాము నిలిపివేయడం లేదని స్పష్టం చేశాయి.
అంతేకాదు, మిడ్ మేనేజ్ మెంట్ స్థాయిలో మెరుగైన పనితీరు కనబర్చిన ఉద్యోగులకు మూడు నెలలకోసారి ప్రమోషన్లు ఇచ్చే విధానాన్ని కొనసాగిస్తున్నామని విప్రో పేర్కొంది. జులై మాసం నుంచి ప్రమోషన్లు క్రమంగా అమలు చేస్తున్నామని, ఇప్పటికే తొలి దశ ప్రమోషన్లు పూర్తయ్యాయని తెలిపింది. అయితే, మూడ్నెల్లకోసారి చెల్లించే వేరియబుల్ పేపై ఇప్పుడేమీ ప్రకటన చేయలేమని వెల్లడించింది.