Hadi Matar: సల్మాన్ రష్దీ బతకడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన దాడికి పాల్పడిన యువకుడు

Hadi Matar would not believe Salman Rushdie survival from attack

  • రష్దీపై న్యూయార్క్ లో దాడి
  • తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలైన వైనం
  • ప్రస్తుతం కోలుకుంటున్న రచయిత
  • పోలీసుల అదుపులో నిందితుడు

ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై ఇటీవల న్యూయార్క్ లో దాడి జరగడం తెలిసిందే. చౌటాక్వా ఇన్ స్టిట్యూట్ లో రష్దీ ప్రసంగించేందుకు వేదికపైకి రాగా, హాదీ మతార్ (24) అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన రష్దీని విషమ పరిస్థితి నడుమ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. కాగా, రష్దీపై దాడికి పాల్పడిన హాదీ మతార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైల్లో ఉన్న హాదీ మతార్ న్యూయార్క్ పోస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

తన దాడిలో తీవ్రగాయాలకు గురైన సల్మాన్ రష్దీ బతకడంపై అతడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అతడు ప్రాణాలతో ఉన్నాడన్న వార్తలు చూసి విస్మయానికి గురయ్యానని తెలిపాడు. సల్మాన్ రష్దీ అంటే తనకు అయిష్టమని, అతడు మంచివాడని తాను భావించడంలేదని హాదీ మతార్ వెల్లడించాడు. రష్దీ ఇస్లామ్ పై దాడికి పాల్పడడం ద్వారా, ఇస్లామిక్ విశ్వాసాలను, ఇస్లామిక్ వ్యవస్థలను దెబ్బతీశాడని ఆరోపించాడు. 

అదే సమయంలో, ఇరాన్ నేత ఆయతుల్లా ఖొమేనీని గొప్ప వ్యక్తిగా అభివర్ణించాడు. ది శాటానిక్ వర్సెస్ పుస్తకం రాసిన సల్మాన్ రష్దీని చంపేయాలంటూ ఖొమేనీ జారీ చేసిన ఫత్వాను అనుసరించి ఈ దాడికి పాల్పడ్డారా? అనే ప్రశ్నకు హాదీ మతార్ సమాధానం ఇవ్వలేదు. అయితే, ది శాటానిక్ వర్సెస్ పుస్తకంలో కొన్ని పేజీలు చదివానని, తనకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తో ఎలాంటి సంబంధంలేదని వెల్లడించాడు.

  • Loading...

More Telugu News