Harish Rao: కాళేశ్వరంలో అవినీతి హద్దులు దాటిందన్న షెకావత్... తీవ్రంగా ఖండించిన హరీశ్ రావు

Harish Rao condemns union minister Shekawat allegations on Kaleswaram project

  • కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందన్న షెకావత్
  • నోరా లేక మోరీనా? అంటూ హరీశ్ రావు మండిపాటు 
  • పుచ్చిపోయిన మాటలు మాట్లాడారని ధ్వజం

తెలంగాణ మంత్రి హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి హద్దులు దాటిందంటూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును షెకావత్ కూడా మెచ్చుకున్నారని గుర్తుచేశారు. మెచ్చుకున్న నోటితోనే పుచ్చిపోయిన మాటలు మాట్లాడారని విమర్శించారు. మీకు నచ్చితే నీతి... నచ్చకపోతే అవినీతా? అంటూ మండిపడ్డారు. అది నోరా? లేక మోరీనా...? అంటూ నిప్పులు చెరిగారు. 

ప్రాజెక్టులు కట్టేందుకు అనుమతులు ఇచ్చింది మీరే కదా? అని నిలదీశారు. అందుకు అవసరమైన నిధులు అప్పు తెచ్చుకునేందుకు అనుమతించింది మీరే కదా? అని ప్రశ్నించారు. ఇచ్చిన అప్పులు బాగా సద్వినియోగం చేశారని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ శర్మ చెప్పారని హరీశ్ రావు వెల్లడించారు. కాళేశ్వరం ఇంజినీరింగ్ ఒక అద్భుతం అన్నారని, ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు అని కొనియాడారని గుర్తుచేశారు.  

ఇప్పుడు కేంద్రమంత్రి షెకావత్ బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. తెలంగాణను చూసి బీజేపీ నేతల కడుపు మండిపోతోందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసించిన వీడియోను ప్రదర్శించారు. 

అంతకుముందు కేంద్రమంత్రి షెకావత్ మాట్లాడుతూ, ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే వేల కోట్ల మేర అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. తగిన అనుమతులు పొందకుండానే ప్రాజెక్టును నిర్మించారని వెల్లడించారు. భారీ వర్షాలకు మూడు పంప్ హౌస్ లు నీటమునిగాయని, పంప్ ల అమరికలో సాంకేతిక వైఫల్యాలు ఉన్నాయని విమర్శించారు. పంప్ ల మరమ్మతుల పేరిట కూడా అవినీతి జరిగేందుకు అవకాశం ఉందని షెకావత్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News