Chalo Vijyawada: సెప్టెంబరు 1న ఛలో విజయవాడ.... జయప్రదం చేయాలన్న ఉద్యోగ సంఘాలు
- ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు విఫలం
- ప్రభుత్వం పాతపాటే పాడిందన్న ఉద్యోగ సంఘాలు
- సీపీఎస్ కంటే జీపీఎస్ ప్రమాదకరమని వెల్లడి
- ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్
ఉద్యోగ సంఘాలు మరోసారి డిమాండ్ల సాధనకు సిద్ధమవుతున్నాయి. సీపీఎస్ పై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు విఫలం అయ్యాయి. చర్చలకు పిలిచిన ప్రభుత్వం పాతపాటే పాడిందని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. ఈ నేపథ్యంలో, సెప్టెంబరు 1న నిర్వహించ తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి.
సీపీఎస్ ఎంత ప్రమాదకరమో, జీపీఎస్ అంతకంటే ప్రమాదకరమని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. జీపీఎస్ వద్దనే విషయాన్ని సంప్రదింపుల కమిటీకి తెలిపామని వెల్లడించారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేసేవరకు పోరాటం ఆగదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. సీపీఎస్ లో వచ్చిన సవరణను ప్రభుత్వం అమలు చేయట్లేదని ఆరోపించారు. హామీ ఇచ్చిన మేరకు ఓపీఎస్ పునరుద్ధరించాలనేదే తమ డిమాండ్ అని పేర్కొన్నారు.