Dolo-650: రూ.1000 కోట్ల తాయిలాలు పొందిన తర్వాతే డాక్టర్లు డోలో-650 రాస్తున్నారంటూ పిటిషన్... విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
- ఫార్మాకంపెనీల తీరుపై సుప్రీంలో పిటిషన్
- విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం
- ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని కామెంట్
- కరోనా వేళ తనకు కూడా డోలో రాశారన్న జస్టిస్ చంద్రచూడ్
ఫార్మా కంపెనీలు తమ మందులనే రోగులకు రాయాలంటూ డాక్టర్లకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తుంటాయని, దీనిపై జవాబుదారీతనం ఉండాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఉదాహరణకు... జ్వరం వస్తే ఇచ్చే డోలో-650 మాత్రను డాక్టర్లు రాస్తున్నారంటే అందుకు కారణం ఆ మాత్రల తయారీదారులు డాక్టర్లకు రూ.1000 కోట్ల తాయిలాలు ఇవ్వడం వల్లేనని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో కేంద్రం తన స్పందనను 10 రోజుల్లోగా తెలియజేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. "ఇదేమీ వీనులవిందైన సంగీతం కాదు. నాకు కరోనా వచ్చినప్పుడు కూడా ఇదే మాత్ర వాడాలని రాశారు. ఇది సీరియస్ మ్యాటర్" అని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.
కాగా, ఈ పిటిషన్ ను ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసింది. ఈ సంస్థ తరఫున న్యాయవాది సంజయ్ పారిఖ్ వాదనలు వినిపించారు. డోలోను ప్రమోట్ చేసేందుకు సదరు కంపెనీ డాక్టర్లకు తాయిలాలపై రూ.1000 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఇలాంటి మందుల అతి వినియోగంతో రోగుల ఆరోగ్యం డోలాయమానంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటువంటి అవినీతి మందుల ధరల పెరుగుదలకు దారితీస్తుందని, లేకపోతే, మార్కెట్లో నిర్హేతుకమైన ఔషధాలు పోగుపడే అవకాశాలు ఉంటాయని పిటిషన్ లో పేర్కొన్నారు. ఫార్మా ఉత్పత్తుల మార్కెటింగ్ విధానాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకోవాలని, తగిన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.