vote: జమ్మూ కశ్మీర్ లో ఎవరైనా ఓటు వేయవచ్చు.. అదెలా అంటే..!
- నివాసం లేదా పని చేస్తున్న వారు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం
- రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ప్రకటన
- దీన్ని తప్పుబడుతున్న రాజకీయ పార్టీలు
జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఎవరైనా ఓటు హక్కును వినియోగించుకోవచ్చంటూ ఆ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి హిర్దేష్ కుమార్ చేసిన ప్రకటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘‘భారత పౌరులు ఎవరైనా సరే, జమ్మూ కశ్మీర్లో నివాసం ఉంటున్నా లేదా పని చేస్తున్నా ఓటరు జాబితాలోకి తమ పేరును నమోదు చేసుకుని, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు’’ అని హిర్దేష్ కుమార్ ప్రకటించారు. సాయుధ దళాల్లో పనిచేస్తున్న వారు కూడా తమ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చుకోవచ్చన్నారు.
దీన్ని జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలు తప్పుబట్టాయి. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ఎవరైనా వెళ్లి ఓటు వేయవచ్చంటే.. ఒకే ఓటర్ పలు రాష్ట్రాల్లో ఓటు వేయవచ్చని అనుమతించినట్టుగా ఉందని విమర్శించాయి.
వాస్తవానికి ఎన్నికల నిబంధనల ప్రకారం పౌరులు దేశంలో ఎక్కడైనా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అలా అని, ఒకటికి మించిన రాష్ట్రాల్లో ఓటు వేయడానికి అనుమతి లేదు. ఒక వ్యక్తి కొత్తగా ఒక రాష్ట్రంలో ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకుంటే, జాబితాలో చేర్చడానికి ముందు, మరెక్కడైనా అతడి పేరు నమోదై ఉందా? అన్న విషయాన్ని తెలుసుకోవడానికి అధికారులు రికార్డులు తనిఖీ చేస్తారు. ఎక్కడా లేనప్పుడే కోరిన విధంగా నమోదు చేస్తారు.
ఇదిలావుంచితే, జమ్మూ కశ్మీర్లో కొత్తగా 20-25 లక్షల మంది ఓటర్లు నమోదైనట్టు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. కానీ, 2019 జనవరి 1 తర్వాత అక్కడ ఓటర్ల జాబితా సవరణ చేయడం మళ్లీ ఇదే మొదటిసారి. పైగా ఏడాదిలో నాలుగు పర్యాయాలు ఓటర్ల జాబితాలో పేరుకు దరఖాస్తు చేసుకునే విధానం అమల్లోకి వచ్చింది.