AAP: ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్‌కు తెలంగాణతో లింకు ఉందని బీజేపీ ఎంపీ ఆరోపణ
- డీల్ తెలంగాణలోనే జరిగిందన్న ఎంపీ పర్వేశ్ వర్మ
- ఆ రాష్ట్రం వాళ్లు బుక్ చేసిన హోటళ్లు, రెస్టారెంట్లకు మనీశ్ వెళ్లాడని ఆరోపణ
- ఇందులో 10-15 మంది ప్రైవేటు వ్యక్తులు ఉన్నారన్న పర్వేశ్
ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీలో అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలతో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ దాడులు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కుంభకోణంలో తెలంగాణకు సంబంధం ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఆరోపించారు. కొత్త పాలసీ రూపకల్పన విషయంలో తెలంగాణలోనే అన్ని వ్యవహారాలు జరిగాయన్నారు.
‘ఈ స్కామ్ కు తెలంగాణతో సంబంధం ఉంది. డీల్ సెట్ చేయడానికి తెలంగాణకు చెందిన వాళ్లు బుక్ చేసిన హోటళ్లు, రెస్టారెంట్లను మనీశ్ సిసోడియా సందర్శించారు. ఇందులో 10-15 మంది ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వ వ్యక్తులతో పాటు సిసోడియా ఉన్నారని నేను భావిస్తున్నాను’ అని వర్మ ఆరోపించారు. ఇక ఈ కేసులో సీబీఐ సిసోడియా నివాసంలో ప్రస్తుతం సోదాలు చేస్తోంది. ఈ కేసులో సిసోడియాతో పాటు మరో ముగ్గురు ప్రజా ప్రతినిధుల పేర్లను ఎఫ్ఐ ఆర్ లో చేర్చింది.