TRS: మునుగోడు ఉప బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి?
- 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం
- 2018లో కోమటిరెడ్డి చేతిలో పరాజయం
- రేపటి సభలో ప్రకటించనున్న కేసీఆర్
నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికకు అధికార టీఆర్ఎస్ తన అభ్యర్థిని ఖరారు చేసింది. బరిలో స్థానిక నేతగా ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే మునుగోడు టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించినట్టు సమాచారం. ఈ నిర్ణయాన్ని రేపు (శనివారం) మునుగోడులో జరగనున్న టీఆర్ఎస్ బహిరంగ సభలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించనున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక జరిగిన 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మునుగోడు నుంచి బరిలోకి దిగిన కూసుకుంట్ల.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు.
దాదాపుగా టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతూ వస్తున్న కూసుకుంట్లపై పార్టీ అధిష్ఠానానికి పెద్దగా వ్యతిరేకత లేకున్నా... స్థానిక నాయకత్వం మాత్రం ఆయనకు టికెట్ ఇస్తే పార్టీ విజయం కోసం పని చేసేది లేదని ఇటీవలే తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో కూసుకుంట్లకే మునుగోడు టికెట్ ఖరారు చేయడం ఆసక్తికరంగా మారింది.