Rajasthan: రాజస్థాన్ ప్రభుత్వం సంచలన పథకం.. రాష్ట్రంలోని మహిళలందరికీ సెల్ఫోన్లు, ఇంటర్నెట్ ఉచితం!
- వచ్చే ఏడాది ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్న ప్రభుత్వం
- హెల్త్స్కీమ్లో చేరిన మహిళలందరికీ ఫోన్లు
- మూడేళ్లపాటు ఉచితంగా ఇంటర్నెట్ ఫ్రీ
- ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.12 వేల కోట్లు
- రేసులో బీఎస్ఎన్ఎల్ సహా మూడు ప్రైవేటు టెలికం కంపెనీలు
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రాజస్థాన్లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఓ సరికొత్త పథకాన్ని తెరపైకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో అర్హులైన 1.35 కోట్ల మంది మహిళలకు ఉచితంగా సెల్ఫోన్లు పంపిణీ చేయడంతోపాటు మూడేళ్లపాటు ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయం కూడా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ఏడాది బడ్జెట్లో డిజిటల్ సేవా యోజన పథకాన్ని సీఎం గెహ్లాట్ ప్రకటించారు. అందులో భాగంగానే తాజాగా ఈ ప్రకటన చేశారు. ఈ కొత్త పథకం కోసం మొత్తం రూ.12 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.
ఈ పథకంలో భాగంగా చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ పేరిట ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య బీమా పథకంలో చేరిన కుటుంబాల్లోని మహిళలకు ఉచిత సెల్ఫోన్లు అందిస్తారు. అంతేకాదు, మూడేళ్లపాటు ఉచితంగా ఇంటర్నెట్ కూడా అందిస్తారు. అర్హులైన వారిని 1.35 కోట్లుగా లెక్క తేల్చారు. డ్యూయల్ సిమ్ ఫోన్లు అయిన వీటిలో ఓ సిమ్కార్డ్ లాక్ చేసి ఉంటుంది. రెండో స్లాట్లో మాత్రం మరో కార్డు వేసుకోవచ్చు.
ఈ పథకంలో భాగంగా సేవలు అందించేందుకు టెలికం సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానించింది. ఈ నెలాఖరుకల్లా బిడ్లను ఖరారు చేయనున్నారు. బీఎస్ఎన్ఎల్ సహా మూడు ప్రైవేటు టెలికం కంపెనీలు పోటీలో ఉన్నాయి. బిడ్ ఏ కంపెనీకి దక్కినా ఆ టెలికం ఖాతాలో 1.35 కోట్ల మంది సబ్స్క్రైబర్లు చేరినట్టే.