Tollywood: ‘కార్తికేయ2’ కలెక్షన్ల సునామీ.. వారంలోనే రూ. 60 కోట్ల వసూళ్లు
- రూ.30 కోట్ల రూపాయలతో తెరకెక్కిన చిత్రం
- హిందీలో 50 స్క్రీన్ల నుంచి 3000 స్క్రీన్లకు పెంపు
- నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా తాజా చిత్రం
యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన ‘కార్తికేయ2’ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా దూసుకెళుతోంది. మైథలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది. దాంతో వారం రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 60.12 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
గత వారం విడుదలైన ఈ సినిమాకు కేవలం మౌత్ టాక్ తోనే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. తొలి వారంలో ఆదివారం, పంద్రాగస్టు, కృష్ణాష్టమి సెలవులు ఈ చిత్రానికి కలిసి వచ్చాయి. వీకెండ్లోనే కాకుండా మంగళ, బుధ, గురువారాల్లో కూడా ఈ సినిమాకు మంచి బుకింగ్స్ వచ్చాయి. పైగా, ప్రతీ రోజు థియేటర్ల, షోల సంఖ్య పెరగడం విశేషం. ముఖ్యంగా హిందీలో కేవలం 50 స్ర్కీన్లలో విడుదలైన ఈ చిత్రం వారం తిరిగే సరికి 3000 స్ర్కీన్లకు పెరగడం అనూహ్యం.
శ్రీ కృష్ణుడికి సంబంధించిన కథ కావడంతో హిందీ జనాలు ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. అలాగే, బాలీవుడ్ స్టార్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో చిన్న పాత్ర పోషించడం కూడా కలిసి వచ్చింది. అదే సమయంలో హిందీ చిత్రాలు ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’ దారుణంగా విఫలం అవడం కూడా ‘కార్తికేయ2’కు ప్లస్ అయింది.
ప్రేక్షకుల నుంచి భారీ డిమాండ్ రావడంతో ‘లాల్ సింగ్ చడ్డా’, ‘రక్షా బంధన్’ సినిమాలను తీసేస్తున్న థియేటర్లు ‘కార్తికేయ2’ షోస్ ను పెంచుతున్నారు. దాంతో, రూ. 30 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రం తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. నిఖిల్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నిఖిల్ గత చిత్రాల్లో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ రూ. 16 .55 కోట్ల షేర్ వసూళ్లతో మొదటి స్థానంలో ఉండేది. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది.