Delhi: సౌతాఫ్రికా నుంచి హవాలా ద్వారా డబ్బు.. కశ్మీర్ టెర్రరిస్టులకు అందజేస్తున్న ఢిల్లీ వ్యక్తి.. అరెస్ట్!
- ఢిల్లీ, జమ్మూకశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్
- హవాలా ద్వారా టెర్రరిస్టులకు డబ్బు పంపిస్తున్న యాసిన్ అరెస్ట్
- యాసిన్ నుంచి నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం
లష్కరే తోయిబా, అల్ బదర్ వంటి ఉగ్రవాద సంస్థలకు హవాలా రూపంలో నిధులను అందిస్తున్న ఒక వ్యక్తిని ఢిల్లీ, జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాయింట్ ఆపరేషన్ నిర్వహించిన ఢిల్లీ, జమ్మూకశ్మీర్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ పోలీస్ కమిషనర్ తెలిపిన వివరాల మేరకు... మెహమ్మద్ యాసిన్ అనే వ్యక్తి ఉగ్రవాదులకు హవాలా రాకెట్ ద్వారా నిధులను అందజేస్తున్నాడు. ఇతను పంపిస్తున్న నిధులను ఆయా ఉగ్రవాద సంస్థలు కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నాయి.
మొహమ్మద్ యాసిన్ ఢిల్లీలోని తుర్క్ మన్ గేట్ ప్రాతంలో నివసిస్తున్నాడు. ఈయన గార్మెంట్ బిజినెస్ ను నిర్వహిస్తున్నాడు. అందరిలో కలిసిపోయి సాధారణ పౌరుడిగా ఉంటూనే... మరోవైపు, ఉగ్రవాదులకు సాయం చేస్తున్నాడు. కశ్మీర్ లోయలోని టెర్రర్ ఆపరేటర్ అబ్దుల్ హమీద్ మిర్ కు గత వారంలో రూ. 10 లక్షలు పంపించాడని పోలీసులు గుర్తించారు. ఈ హవాలా లావాదేవీలకు సంబంధించి జమ్మూకశ్మీర్ పోలీసులు మెహమ్మద్ యాసిన్ పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు యాసిన్ నుంచి రూ. 7 లక్షల నగదు... ఒక మొబైల్ ఫోన్ ను స్వాథీనం చేసుకున్నారు.
పోలీసులు చెపుతున్న వివరాలను బట్టి.... హవాలా మనీ ఛానెల్ కు యాసిన్ పని చేస్తున్నాడు. విదేశాలతో తనకున్న కాంటాక్టులతో డబ్బును జమ్మూకశ్మీర్ లోని టెర్రర్ ఆర్గనైజేషన్లకు పంపిస్తున్నాడు. మరోవైపు పోలీసు విచారణలో యాసిన్ కీలక విషయాలను వెల్లడించాడు. హవాలా డబ్బును సౌతాఫ్రికా నుంచి గుజరాత్ లోని సూరత్ తో పాటు ముంబైకి రప్పించి... ఇక్కడి నుంచి జమ్మూకశ్మీర్ కు పంపిచినట్టు తెలిపాడు. హవాలా సిండికేట్ లో యాసిన్ కీలక వ్యక్తి అని పోలీసులు చెపుతున్నారు.