Pappireddy Manjunath Reddy: మంజునాథరెడ్డిది ఆత్మహత్యే.. పోస్టుమార్టంలో తేల్చిన పోలీసులు
- నిన్న సాయంత్రమే అంత్యక్రియలు పూర్తి
- ఒకరు మోసగించి ఆత్మహత్యకు పురికొల్పారంటూ కేసు
- మంజునాథరెడ్డి కంపెనీ భాగస్వామి సుఖవాసి చక్రధర్పై అనుమానం వ్యక్తం చేసిన తండ్రి
రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథరెడ్డి (34)ది ఆత్మహత్యేనని పోలీసులు తేల్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్మెంట్ 101వ నంబరు ప్లాటులో శుక్రవారం ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం నిన్న ఆయన మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. స్వగ్రామమైన అన్నమయ్య జిల్లా హసనాపురం పంచాయతీలోని పప్పిరెడ్డిగారిపల్లెలో నిన్న సాయంత్రమే అంత్యక్రియలు నిర్వహించారు.
మంజునాథరెడ్డి తండ్రి మహేశ్వర్రెడ్డి ఫిర్యాదుపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మంజునాథరెడ్డిని ఒకరు మోసం చేసి ఆత్మహత్యకు పురికొల్పినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. సహస్ర కంపెనీలో తన కుమారుడి భాగస్వామి అయిన రాయచోటికి చెందిన సుఖవాసి చక్రధర్పై మహేశ్వర్రెడ్డి ఆరోపణలు చేశారు. తన కుమారుడి మృతికి కారణం అతడేనన్నారు. చేసిన పనులకు సంబంధించి 4 బిల్లులు మంజూరైనా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. ఇటీవల ఐదో బిల్లు మంజూరైనా డబ్బులు ఇవ్వలేదని, తాను పెట్టిన యంత్రాలకు కూడా డబ్బులు చెల్లించలేదని, అతడి వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మహేశ్వర్రెడ్డి ఆరోపించారు.