New Delhi: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన సీబీఐ
- ఎక్సైజ్ స్కామ్ కేసులో జారీ చేసిన సీబీఐ
- ఇదేం డ్రామా? అని మోదీని ప్రశ్నించిన సిసోడియా
- తాను ఢిల్లీలోనే ఉన్నానని, ఎక్కడికి రావాలో చెప్పాలంటూ ట్వీట్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో పాటు మరో 13 మందిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సిసోడియా సహా మొత్తం 14 మంది పేర్లు ఉన్నాయి. లుక్ అవుట్ నోటీసు ఒక వ్యక్తిని దేశం విడిచి వెళ్లకుండా నిరోధిస్తుంది. ఒకవేళ దేశం విడిచి వెళ్లే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవచ్చు.
ఈ నోటీసుపై మనీశ్ సిసోడియా స్పందిస్తూ.. ‘ఇదేం డ్రామా’ అంటూ ప్రధాని మోదీపై మండిపడ్డారు.‘మీ దాడులన్నీ అయిపోయాయి. ఏమీ దొరకలేదు. ఒక్క పైసా కూడా లభించలేదు. ఇప్పుడు మనీశ్ సిసోడియా అందుబాటులో లేరని లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. ఏంటి మోదీజీ ఈ జిమ్మిక్కు?. నేను ఢిల్లీలో స్వేచ్ఛగా తిరుగుతున్నాను, ఎక్కడికి రావాలో చెప్పండి. మీరెక్కడున్నారో నాకు కనిపించడం లేదు’ అని ట్వీట్ చేశారు.