Jayalalithaa: మాజీ సీఎం జయలలిత చికిత్సపై ఎయిమ్స్ ప్యానెల్ నివేదిక
- చెన్నై అపోలో ఆసుపత్రి చికిత్సలో లోపాల్లేవు
- నిర్ధారణకు వచ్చిన ఎయిమ్స్ వైద్యుల ప్యానెల్
- జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ కు నివేదిక
మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఇచ్చిన వైద్య చికిత్సలో ఎటువంటి లోపాలు లేవని ఎయిమ్స్ వైద్యుల ప్యానెల్ నిర్ధారణకు వచ్చింది. ఆరుగురు సభ్యుల ఈ ప్యానెల్ ను సుప్రీంకోర్టు గతేడాది నవంబర్ 30న నియమించింది. జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ కు కావాల్సిన సాయాన్ని ఈ ప్యానెల్ అందించాల్సి ఉంటుంది.
కార్డియాలజిస్ట్ డాక్టర్ సందీప్ సేత్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం చెన్నై అపోలో హాస్పిటల్ లో జయలలిత చికిత్సా రికార్డులను పూర్తిగా అధ్యయనం చేసింది. రేడియాలజీ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులను కూడా పరిశీలించింది. ఆసుపత్రిలో చేరడానికి ముందే జయలలితకు మధుమేహం, వర్టిగో, అటోపిక్ డెర్మటైటిస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, హైపోథైరాయిడ్, క్రానిక్ బ్రాంకైటిస్ కు చికిత్స తీసుకుంటున్నట్టు ప్యానెల్ నిర్ధారణకు వచ్చింది. ఈ మేరకు తన అధ్యయన నివేదికను జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ కు అందించింది.
జయలలిత ఇన్ని సమస్యల్లోనూ ఆసుపత్రిలో చేరడానికి ముందు వరకు.. ద్రాక్ష పండ్లు, కేక్ లు, స్వీట్లు తిన్నట్టు డాక్టర్ శివకుమార్ నిర్ధారించారు. 2016 డిసెంబర్ 4న అపోలో హాస్పిటల్ లో ఉన్న జయలలితకు గుండె పోటు రాగా, 5న ఆమె మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించడం తెలిసిందే.