kids: ఫ్లూ ఇన్ఫెక్షన్లతో త్వరగా కోలుకోలేకపోతున్న చిన్నారులు
- ఈ సీజన్ లో పదే పదే ఇన్ఫెక్షన్లు
- బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఇదే పరిస్థితి
- తగ్గడానికి చాలా రోజుల సమయం
- ఒకే చిన్నారికి వరుసగా వేర్వేరు ఇన్ఫెక్షన్లు
- రోగ నిరోధక శక్తి తగ్గడంతో పెరిగిన తీవ్రత
ఈ ఏడాది చిన్నారులు ఫ్లూ వైరస్ లతో ఎక్కువగా సతమతం అవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు చిన్నారులు శ్వాసకోస ఇన్ఫెక్షన్ల బారిన పడే రిస్క్ ఎదుర్కొంటూ ఉంటారు. వర్షాకాలంలో తేమతో కూడిన వాతావరణంలో వైరస్ లు బలంగా ప్రభావం చూపిస్తుంటాయి. కానీ, ఈ ఏడాది ఇది మరింత తీవ్రంగా ఉంది.
జ్వరం, జలుబు, దగ్గు, వళ్లు నొప్పులు ఈ సమస్యలతో పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. వరుస వెంట ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఒకే చిన్నారి పలు రకాల వైరస్ లతో (ఇన్ ఫ్లూయెంజా, అడెనోవైరస్, బోకావైరస్, మెటాన్యూమోవైరస్) మళ్లీ ఇన్ఫెక్షన్ కు లోనవుతున్నట్టు వైద్యులు తెలియజేస్తున్నారు.
ఒకే చిన్నారి పలు ఇన్ఫెక్షన్ల తో ఒకటికి మించిన సార్లు ఆసుపత్రులకు వస్తున్నట్టు బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్ పీడియాట్రిక్స్ హెడ్ డాక్టర్ భాస్కర్ షెనాయ్ తెలిపారు. ఒక చిన్నారికి ఒక ఇన్ఫెక్షన్ కు చికిత్స అందిస్తే, 10 రోజుల తర్వాత మరో ఇన్ఫెక్షన్ తో చికిత్స కోసం వస్తున్నట్టు మరో డాక్టర్ శివప్రకాష్ తెలిపారు.
పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గడాన్ని కారణంగా వైద్యులు పేర్కొంటున్నారు. గత రెండున్నరేళ్లుగా వారు బయటకు వెళ్లకుండా, సాధారణ వైరస్ లకు ఎక్స్ పోజ్ కాకుండా ఉండడాన్ని గుర్తు చేస్తున్నారు. పాఠశాలలు తిరిగి తెరుచుకున్నందున.. స్కూల్ నుంచే చాలా మంది పిల్లలు ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నట్టు చెబుతున్నారు.
‘‘వరుస వెంట ఇన్ఫెక్షన్ల బారిన పడడం వల్ల శ్వాసకోస వ్యవస్థ దెబ్బతింటోంది. దీంతో వారికి గురక వస్తోంది. గురక తగ్గడానికి మందులతో చికిత్స చేస్తున్నాం. మా హాస్పిటల్ లో 80 శాతం కేసులు ఇన్ ఫ్లూయెంజా వైరస్ కారణంగా వచ్చినవే’’అని స్పర్శ్ హాస్పిటల్ డాక్టర్ రవిశంకర్ తెలిపారు. ఇన్ఫెక్షన్లు కూడా ఐదు నుంచి పది రోజుల పాటు ఉంటున్నాయని, దగ్గు చాలా రోజుల పాటు కొనసాగుతోందని వైద్యులు చెబుతున్నారు. పిల్లలకు ఇలాంటి లక్షణాలు ఉంటే స్కూళ్లకు పంపొద్దని, అది ఇతర పిల్లలకు వ్యాపించే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.