Tomato Flu: భారత్‌లో వ్యాపిస్తున్న టొమాటో ఫ్లూ.. లక్షణాలు ఇవే!

What is Tomato flu that is spreading in India

  • ‘లాన్సెట్’ అధ్యయనం ప్రకారం దేశంలో 82 కేసులు
  • మే 6న కేరళలో తొలి కేసు నమోదు
  • చికున్ గున్యా, డెంగ్యూ ఫీవర్ లక్షణాలే ఇందులోనూ కనిపిస్తాయంటున్న నిపుణులు

రోజుకోటి చొప్పున పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజలను భయం గుప్పిట్లోకి నెట్టేస్తున్నాయి. కరోనా వైరస్ ఈ ప్రపంచాన్ని చుట్టేసిన తర్వాత బోల్డన్ని వైరస్‌లు వెలుగులోకి రాగా నిన్నమొన్నటి వరకు మంకీపాక్స్ వైరస్ భయపెట్టింది. తాజాగా టొమాటో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ‘లాన్సెట్’ అధ్యయనం ప్రకారం.. భారత్‌లో ఇప్పటి వరకు 82 టొమాటో ఫ్లూ(టొమాటో ఫీవర్) కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ను తొలుత మే 6న కేరళలో గుర్తించారు. ఇది ఎక్కువగా ఐదేళ్లలోపు చిన్నారులకు సోకుతుంది. అలాగే, రోగ నిరోధక శక్తి సన్నగిల్లిన పెద్దలకూ ఇది సోకుతుందని నిపుణులు చెబుతున్నారు.   

అసలేంటీ టొమాటో ఫ్లూ?
టొమాటో ఫ్లూను ఈ ఏడాది మే 6న కేరళలోని కొల్లాం జిల్లాలో గుర్తించారు. కొవిడ్-19ను పోలిన లక్షణాలే ఇందులోనూ ఉంటాయి. అయితే వైరస్ మాత్రం సార్స్-కోవ్-2కు సంబంధించినది కాదు. పిల్లల్లో చికున్ గున్యా, డెంగ్యూ ఫీవర్ తర్వాత ఇది సంభవిస్తున్నట్టు గుర్తించారు. ఈ వైరస్ సోకిన వ్యక్తుల్లో ఎర్రని పొక్కులు వచ్చి క్రమంగా టొమాటో అంత పెద్దగా తయారవుతాయి. కాబట్టే దీనికి టొమాటో ఫ్లూ అని పేరు వచ్చింది. 

లక్షణాలేంటి?
ఈ వైరస్‌కు గురైన చిన్నారుల్లో చికున్ గున్యా లక్షణాలుంటాయి. తీవ్రమైన జ్వరం, దద్దుర్లు, కీళ్ల నొప్పులు వంటివి వేధిస్తాయి. నొప్పులు, జ్వరం, అలసట వంటి లక్షణాలు కొవిడ్ రోగుల్లో ఉన్నట్టుగానే ఉంటాయి. అలాగే, కీళ్లవాపు, వికారం, విరేచనాలు, డీహైడ్రేషన్, కీళ్లనొప్పులు, జ్వరం వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో చర్మంపై దద్దుర్లు కూడా వస్తాయి. కొన్నిసార్లు డెంగ్యూ లక్షణాలు కూడా కనిపిస్తాయని అధ్యయనం పేర్కొంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే మాలిక్యులర్, సెరోలాజికల్ పరీక్షలు చేయించుకోవాలి.  
 
 చికిత్స
టొమాటో ఫ్లూ చికిత్స కూడా చికున్‌ గున్యా, డెంగ్యూ, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్‌కు తీసుకునే చికిత్సలానే ఉంటుంది. ఇతరుల నుంచి దూరంగా ఉండాలి. విశ్రాంతి అవసరం. ద్రవాలు పుష్కలంగా తీసుకోవాలి. జ్వరం, నొప్పుల నుంచి ఉపశమనం కోసం పారాసిటమాల్ మాత్రలు వాడాలి. మరీ ఆందోళనకరంగా ఉంటే వైద్యులను సంప్రదించాలి.

  • Loading...

More Telugu News