UP minister: ఉన్నత విద్యా మంత్రి వచ్చినా కాలేజీలోకి అనుమతించలేదు.. యూపీలో విచిత్రం
- ఆగ్రాలోని ఓ కాలేజీలో పెయింటింగ్ ఎగ్జిబిషన్
- పాల్గొనేందుకు వచ్చిన మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ
- 15 నిమిషాలు వేచి చూసినా తెరుచుకోని గేటు
- వెనక్కి వెళ్లిపోయిన మంత్రి
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయకు చేదు అనుభవం ఎదురైంది. 15 నిమిషాలు వేచి చూసినా ఆయన్ను లోపలకు అనుమతించకుండా అవమాన భారానికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను పరిశీలించినట్టయితే.. ఆగ్రాలోని ఓ కళాశాలలో శనివారం పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దీనికి హాజరయ్యేందుకు మంత్రి ఉపాధ్యాయ అక్కడకు చేరుకున్నారు. ఎంతకీ గేటు తెరవకపోవడంతో ఆయన అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కళాశాల ప్రిన్సిపాల్ అనురాగ్ శుక్లా దీనిపై స్పందించారు. డ్రాయింగ్, పెయింటింగ్ ఎగ్జిబిషన్ ను ఓ ఫ్యాకల్టీ ఎన్జీవో సహకారంతో ప్రైవేటుగా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కళాశాలలో ఇంటర్నల్ పరీక్షలు కూడా ఉండడంతో తీవ్రమైన వాహనాల రద్దీ ఏర్పడినట్టు వివరించారు. దీనివల్ల అలాంటి దురదృష్టకర ఘటన జరిగినట్టు తెలిపారు. ఎగ్జిబిషన్ ను నిర్వహించిన టీచర్ నుంచి వివరణ కోరినట్టు చెప్పారు. లోపాలపై అధ్యయనానికి కమిటీని నియమించినట్టు తెలిపారు. మంత్రికి జరిగిన అసౌకర్యానికి విచారిస్తున్నట్టు ప్రకటించారు.