Gujarat: అసెంబ్లీ ఎన్నికల ముంగిట గుజరాత్ క్యాబినెట్లో మార్పులు
- ఇద్దరు మంత్రుల శాఖలను తొలగించిన సీఎం భూపేంద్ర పటేల్
- రాజేంద్ర త్రివేది, పూర్ణేష్ మోదీలకు చెందిన కొన్ని శాఖలు ఇతరులకు అప్పగింత
- ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు
ఈ ఏడాది చివర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముంగిట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన క్యాబినెట్లో కీలక మార్పులు చేశారు. కేబినెట్ మంత్రులు రాజేంద్ర త్రివేది, పూర్ణేష్ మోదీల నుంచి కొన్ని శాఖలను తొలగించారు. దాంతో, రాజేంద్ర రెవెన్యూ శాఖను, పూర్ణేష్ రోడ్లు, భవనాల శాఖను కోల్పోయారు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట తీసుకున్న ఈ చర్య చర్చనీయాంశమైంది.
సీఎం భూపేంద్ర.. హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవికి అదనంగా రెవెన్యూ బాధ్యతలు అప్పగించారు. పరిశ్రమలు, అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రిగా ఉన్న జగదీష్ పంచల్‌కు రోడ్లు, భవనాల మంత్రిత్వ శాఖను ఇచ్చారు. శాఖల తొలగింపు తర్వాత ప్రస్తుతం రాజేంద్ర త్రివేది విపత్తు నిర్వహణ, న్యాయ, అసెంబ్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలను నిర్వర్తిస్తున్నారు. పూర్ణేష్ మోదీ దగ్గర రవాణా, పౌర విమానయానం, పర్యాటకం, తీర్థయాత్రల అభివృద్ధి మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. కాగా, ఈ ఇద్దరు మంత్రులపై పనిభారం తగ్గించేందుకే శాఖలు తగ్గించాలన్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా చెబుతున్నారు.