Punjab: చండీగఢ్, మొహాలీకి ఉగ్ర దాడుల హెచ్చరిక
- నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తం అయిన పోలీసులు
- 26/11 తరహా ఉగ్రదాడి జరుగుతుందని ముంబై ట్రాఫిక్ కంట్రోల్ విభాగం వాట్సప్ కు నిన్న బెదిరింపు సందేశం
- పంజాబ్, పొరుగు రాష్ట్రాల్లో దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్న ఐఎస్ఐ
చండీగఢ్, పంజాబ్‌లోని మొహాలీలో పాకిస్థాన్ కు చెందిన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. చండీగఢ్, మొహాలీలోని బస్టాండ్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ సమాచారం ఆధారంగా రాష్ట్ర పోలీసులు, జీఆర్పీ, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సమన్వయం చేసుకుని పని చేయాలని నిఘా వర్గాలు సూచించాయి.
26/11 తరహా ఉగ్రదాడి జరుగుతుందని హెచ్చరిస్తూ ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ వాట్సాప్ నంబర్‌కు బెదిరింపు సందేశం పంపిన తర్వాతి రోజు ఈ హెచ్చరికలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి ఆత్మాహుతి దాడి తరువాత పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ స్పాన్సర్ చేసిన ప్రచార వీడియో బయటపడింది. వీడియోలోని ఉగ్రవాదులు ఆగస్టు 11న జరిగిన ఈ దాడి చేసింది తామే అని వెల్లడించారు.
ఇక, 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో భద్రతా సంస్థలు చాలా రోజుల నుంచే అప్రమత్తంగా ఉన్నాయి. పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థలు మన దేశంలోని భద్రతా సంస్థలు, ఫార్వార్డ్ పోస్ట్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి విస్తృతమైన ప్రణాళికలు రూపొందించాయని తెలుసుకున్నాయి. ఈ క్రమంలో దేశంలోకి ఆయుధాలు, పేలుడు సామగ్రిని పంపుతున్నాయని గుర్తించాయి. పంజాబ్ తో పాటు పొరుగు రాష్ట్రాల్లో తీవ్రవాద దాడులను నిర్వహించాలని వివిధ ఖలిస్థానీ తీవ్రవాద సంస్థలపై పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఒత్తిడి తెస్తోంది.