Andhra Pradesh: మళ్లీ ఢిల్లీ వెళ్తున్న సీఎం జగన్.. రేపు ప్రధాని మోదీతో కీలక భేటీ
- కొన్ని రోజుల కిందటే మోదీతో సమావేశం అయిన జగన్
- తాజా పర్యటనలో పోలవరం, విభజన హామీలపై చర్చ జరిగే అవకాశం!
- అమిత్ షా ను కూడా కలవనున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు రాత్రి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరుతారు. ఈ రాత్రి ఢిల్లీలో తన నివాసంలో బస చేస్తారు. సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. కొద్ది రోజుల క్రితమే నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారు. ఇప్పుడు మరోసారి సీఎం, పీఎం మధ్య భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమావేశంలో మోదీతో జగన్ కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పోలవరం నిర్వాసితుల సమస్య, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, సవరించిన అంచనాలకు ఆమోదం పైన ప్రధానికి వివరించనున్నారు. అలాగే, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను అమలు చేయాలని సీఎం కోరుతారని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ సీఎం జగన్ చర్చించే అవకాశాలు ఉన్నాయి.
ఈ టూర్ లో భాగంగా ముఖ్యమంత్రి జగన్... నూతన రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన ధన్ ఖడ్ తోనూ సమావేశం కానున్నారు. ఈ రెండు ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులైన ముర్ము, ధన్ ఖడ్ కు వైసీపీ మద్దతుగా నిలిచింది.