Maharashtra: పోలీసు వ్యాన్‌లో కూర్చుని బర్త్ డే కేక్ కట్ చేసిన హత్యకేసు నిందితుడు
- మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘటన
- పలు హత్యలు, దోపిడీ కేసుల్లో జైలులో ఉన్న నిందితుడు
- కోర్టులో హాజరు పరిచేందుకు బయటకు తీసుకొచ్చిన పోలీసులు
- మద్దతుదారులు తీసుకొచ్చిన కేక్‌ను కట్ చేసిన నిందితుడు
హత్యకేసు నిందితుడు ఒకరు పోలీస్ వ్యాన్‌లో కూర్చుని బర్త్ డే కేక్ కట్ చేశాడు. మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్ నగర్లో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చాక పోలీసులు, ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉల్హాస్‌నగర్‌కు చెందిన రోషన్ ఝా గ్యాంగ్‌స్టర్. అతడిపై జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పలు హత్యలు, దోపిడీ కేసులు నమోదై ఉన్నాయి.
ప్రస్తుతం జైలులో ఉన్న రోషన్ ఝాను ఓ కేసు విషయంలో కల్యాణ్‌లోని కోర్టులో హాజరు పరిచేందుకు జైలు నుంచి తీసుకొచ్చారు. రోషన్‌ను జైలు నుంచి బయటకు తీసుకురాగానే అప్పటికే అక్కడికి చేరుకున్న అతడి మద్దతుదారులు బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం కేక్ తీసుకొచ్చారు.
దానిని తీసుకున్న రోషన్ ఝా పోలీసు వ్యాన్‌లో కూర్చునే కేక్ కట్ చేశాడు. అతడు కేక్ కట్ చేస్తుండగా అనుచరులు వీడియో తీసి దానిని వారు తమ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకున్నారు. దీంతో అది కాస్తా వైరలై విమర్శలకు దారితీసింది. హత్య కేసు నిందితుడు పోలీస్ వ్యాన్లోనే కేక్ కట్ చేస్తుంటే పోలీసులు చూస్తూ ఎలా ఊరుకున్నారని ప్రశ్నిస్తున్నారు.