money: ఆర్థిక ఆరోగ్యాన్ని విస్మరించొద్దు.. అందుకోసం ఇవి కీలకం..!
- రుణాలు తీసుకోవద్దు.. తీసుకున్నా పరిమితి మేరకే
- రుణాలకు ఈఎంఐ సకాలంలో చెల్లించాలి
- దీనివల్ల క్రెడిట్ స్కోరు బలపడుతుంది
- లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు
- ప్రతి ఒక్కరికీ జీవిత బీమా కవరేజీ తగినంత వుండాలి
ఆరోగ్యం పరిధిలోకి ఆర్థిక ఆరోగ్యాన్ని కూడా చేర్చుకోవాలి. శారీరక, మానసిక ఆరోగ్యం ఎంత విలువైనదో, ఆర్థిక ఆరోగ్యం కూడా అంతే అవసరం. డబ్బు విషయంలో నిర్లక్ష్యం, లెక్కలేని తనం పనికిరావు. ఎంత పద్ధతిగా, క్రమశిక్షణగా నడుచుకుంటే జీవితం అంత సౌకర్యంగా, సంతోషంగా ఉంటుంది.
రుణాలు
అసలు రుణాలు తీసుకోవచ్చా..? అంటే తీసుకోకూడదని కొందరు చెబుతారు. కొన్ని సందర్భాల్లో తీసుకోవాలన్నది మరికొందరు నిపుణుల సూచన. అయితే రుణం తీసుకున్నా చెల్లించే ఈఎంఐ ఆర్థిక లక్ష్యాలకు అడ్డంకిగా మారకూడదు. అవసరమైతే తప్ప రుణం తీసుకోకూడదన్నది అనుసరణీయమే. ముఖ్యంగా ఒకటికి మించిన రుణాలు ఉండకూడదు. చెల్లించే ఈఎంఐ ఆర్థిక లక్ష్యాలు, ప్రణాళికలకు విఘాతం కాకూడదు. అప్పుడే రుణం రైట్ అవుతుంది.
సకాలంలో చెల్లింపులు
రుణాలు తీసుకుంటే, వాటి పట్ల బాధ్యతగా నడుచుకోవాలి. ముందస్తు ప్రణాళిక కూడా ఉండాలి. ఈఎంఐని గడువు దాటిపోకుండా ఎప్పటికప్పుడు సకాలంలో చెల్లిస్తూ ఉండాలి. దీనివల్ల క్రెడిట్ స్కోరు బలపడుతుంది. ఆలస్యం చేసినా, బిల్లులో కనీస మొత్తాన్ని చెల్లించి మిగిలినది వాయిదా వేసుకున్నా, ఏదైనా ఈఎంఐ ఫెయిల్ అయినా అది క్రెడిట్ స్కోరుపై తప్పక ప్రభావం చూపిస్తుంది. దాంతో భవిష్యత్తులో మరోసారి రుణం కావాలంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
పెట్టుబడులు
ఆర్థిక ఆరోగ్యం కోరుకునే వారు తప్పకుండా చేయాల్సిన పని పెట్టుబడులు పెట్టడం. ఆర్థికంగా మంచి జీవితం కోరుకునే వారు ద్రవ్యోల్బణాన్ని మించి అధిక రాబడులు వచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే సంపద సాధ్యపడుతుంది. దాంతో ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అధిక రాబడుల కోసం ఈక్విటీల వంటి మెరుగైన సాధనాలను ఎంపిక చేసుకోవాలి.
లక్ష్యాలకు అనుగుణంగా..
ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటి విషయంలో క్రమశిక్షణగా నడుచుకోవడం ఎంతో అవసరం. పరిస్థితులు ఎలా ఉన్నా లక్ష్యాలను విడిచిపెట్టకూడదు. అవసరమైతే ఆర్థిక సలహాదారులు, నిపుణుల సాయంతో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.
అత్యవసర నిధి
నెలవారీ ఆర్జన, పొదుపు పెట్టుబడుల లక్ష్యాలను అనుసరించేవారు, వీటికి అదనంగా అత్యవసర నిధిని కూడా సమకూర్చుకోవాలి. ఊహించని పరిస్థితులలో కొంత కాలం పాటు ఆదాయం ఆగిపోయినా మీ జీవిత అవసరాలకు ఇబ్బందులు రాకుండా ఉంటుంది. అంతేకాదు, ఆ కాలంలోనూ పెట్టుబడులు కొనసాగించుకోవచ్చు. కనీసం ఆరు నెలల నుంచి ఏడాది అవసరాలకు సరిపడా అత్యవసర నిధి ఉండాలంటారు నిపుణులు. ఈ నిధిని రెండు మూడేళ్లకోసారి సమీక్షించుకోవాలి.
బీమా రక్షణ
ప్రతి వ్యక్తి తనపై ఆధారపడిన వారికి ఆర్థిక రక్షణ కల్పించాలి. అంటే తమ పేరిట జీవిత బీమా కవరేజీ తీసుకోవాలి. దీనివల్ల ఏ కారణంగా అయినా ఆర్జనాపరుడు మరణిస్తే, అతడిపై ఆధారపడిన వారికి బీమా పరిహారం ఆధారంగా నిలుస్తుంది. వార్షిక ఆదాయానికి 10-20 రెట్లకు బీమా ప్లాన్ తీసుకోవచ్చు.
వీలునామా
తమ మరణానంతరం వారసుల మధ్య ఆస్తుల వివాదాలు ఏర్పడకూడదని భావిస్తే.. అందుకోసం జీవించి ఉండగానే ఎవరికి ఏ ఆస్తి దక్కుతుందో సంపూర్ణ వివరాలతో విల్ రాసి, రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాత ఆస్తుల బదిలీ ప్రక్రియ సాఫీగా సాగిపోతుంది. న్యాయవివాదాలు ఏర్పడకుండా ఉంటాయి.