Kodali Nani: అమిత్ షా - జూనియర్ ఎన్టీఆర్ కలయికపై కొడాలి నాని స్పందన

Kodali Nani response on Amith Shah and Junior NTR meeting

  • రాజకీయ వ్యూహాల్లో భాగంగానే వీరి భేటీ జరిగి ఉండొచ్చన్న నాని 
  • ఎన్టీఆర్ సేవలను దేశ వ్యాప్తంగా ఉపయోగించుకునే అవకాశం ఉండొచ్చని వ్యాఖ్య 
  • తెలుగు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు మోదీ, అమిత్ షాలు ఎన్నో వ్యూహాలతో ముందుకు సాగుతున్నారన్న నాని 

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ నిన్న రాత్రి భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ దేని గురించి మాట్లాడుకున్నారనే విషయం బయటకు రాకపోవడంతో... ఎవరికి తోచినట్టు వారు విశ్లేషణలు చేస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ... రాజకీయ ప్రయోజనాలు లేకపోతే ప్రధాని మోదీ, అమిత్ షా ఎవరితోనూ ఒక్క నిమిషం కూడా మాట్లాడరని అన్నారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగానే తారక్ తో అమిత్ షా కలిసి ఉంటారని చెప్పారు. 

తెలుగు రాష్ట్రాల్లో విస్తరించడానికి మోదీ, అమిత్ షా ద్వయం ఎన్నో వ్యూహాలతో ముందుకు సాగుతున్నారని... ఇందులో భాగంగానే ఎన్టీఆర్, అమిత్ షాల భేటీ జరిగి ఉండొచ్చని అన్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యారని, ఆయన సేవలను దేశ వ్యాప్తంగా బీజేపీ ఉపయోగించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ సినిమాలు బాగున్నాయని అభినందించడానికి ఎన్టీఆర్ ను అమిత్ షా కలిశారని తాను భావించడం లేదని... దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని అనుకుంటున్నానని చెప్పారు. 

నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద ఉన్న హోటల్ నొవోటెల్ లో అమిత్ షా - ఎన్టీఆర్ ల భేటీ జరిగింది. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం జరిగితే... వీరిద్దరూ ఏకాంతంగా 20 నిమిషాల పాటు చర్చించుకున్నారు. అనంతరం భోజనం చేశారు.

  • Loading...

More Telugu News